సాధారణంగా పెళ్లిళ్లలో అనేక రకాల బ్యాండ్లను విని ఉంటాము. వాటిల్లో తీన్మార్, మర్ఫా, బజంత్రీలు, పియానో, మహారాష్ట్ర బ్యాండ్, కేరళ బ్యాండ్ అని ఇలా వివిధ రకాల వాయిద్యాలు పెళ్లి క్రతువుకు మరింత జోష్‌ను తెస్తాయి. అంతేగాక ఒక్కోసారి మిలటరీ బ్యాండ్ మేళాన్ని కూడా వింటూ ఉంటాము. కానీ పంజాబ్ పోలీస్ అధికారులు మాత్రం వినూత్నంగా ఆలోచించారు. తమ శాఖకు మాత్రమే పరిమితమైన బ్యాండ్‌ను ఇకపై అందరి వివాహ వేడుకలతో పాటు ఇతర శుభకార్యాల్లో కూడా వాయించుకునే అవకాశాన్ని కల్పించింది శ్రీ ముక్త్సార్ సాహిబ్ జిల్లా పోలీస్ శాఖ. దీంతో పంజాబ్ ప్రజలు ఇక నుంచి తమ వ్యక్తిగత కార్యక్రమాల్లో కూడా పంజాబ్ పోలీస్ బ్యాండ్‌ను చేర్చుకొని తమ వేడుకలను ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిర్వహించుకోవచ్చు. ఇందుకోసం ముందుగానే బుకింగ్స్ చేసుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా ప్రజల శుభకార్యాల్లో స్వయంగా పోలీసులే బ్యాండ్ వాయిద్యాలను వాయిస్తారని చెప్పింది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలను శ్రీ ముక్త్సార్ సాహిబ్ జిల్లా ఎస్ఎస్పీ హర్మన్‌దీప్ సింగ్ గిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సర్క్యులర్‌లో ప్రజలు తమ వివాహాలతో పాటు ఇతర శుభకార్యాలకి కూడా పంజాబ్ పోలీస్ శాఖ బ్యాండ్‌ను బుక్ చేసుకోవచ్చని వివరించింది. ఈ బ్యాండ్‌ను ముందుగా ఎలా బుక్ చేసుకోవాలి..? ఎంత రుసుమును చెల్లించాలనే వివరాలను కూడా ఇందులో క్లుప్తంగా వివరించారు ఎస్ఎస్పీ. కాగా, ఈ పంజాబ్ పోలీసుల అధికారిక బ్యాండ్‌లో సినిమా పాటల ట్యూన్లను కూడా వాయిస్తారు పోలీసులు.
సాధారణంగా రాష్ట్ర పోలీస్ శాఖల బ్యాండ్ చప్పుడును కేవలం గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవాన లేదంటే ఇతర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాల్లో మాత్రమే వింటూంటాము. వీటి చప్పుడు ఏ ఇతర ప్రైవేటు ప్రోగ్రామ్‌లలోనూ వినే అవకాశమే ఉండదు. కానీ, పంజాబ్ పోలీస్ శాఖ మాత్రం అందరికి ఉపయోగపడేలా ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నిర్ణయంతో సామాన్య ప్రజల దగ్గర్నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు అందరూ పంజాబ్ పోలీస్ బగల్(బ్యాండ్)ను వ్యక్తిగత కార్యక్రమాల్లో కూడా వాయించుకోవ్చచు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవచ్చని సూచించింది పోలీస్ శాఖ. అయితే ఈ నిర్ణయం ఆ రాష్ట్ర పోలీస్ శాఖ ఖజానాకు ఆదాయ వనరుగా మారనుంది.
గంటకు రూ.5000..
ఇక పంజాబ్ పోలీస్ బ్యాండ్‌ను ఒక గంట సమయం కోసం బుకింగ్ చేసుకుంటే రూ.5000 రుసుము చెల్లించాలి. అయితే బ్యాండ్‌ను బుకింగ్ చేసుకున్న నిర్ణీత వ్యవధి దాటితే మాత్రం.. గంటకు ప్రభుత్వ ఉద్యోగులకు రూ.2,500, సామాన్యులకు రూ.3,500 చొప్పున అదనంగా సొమ్ము చెల్లించాల్సి వస్తుంది. దీంతోపాటు ఫ్యామిలీ ఫంక్షన్స్ కోసం సైనిక బ్యాండ్‌ను బుక్ చేసుకోవాలంటే రూ.7,000 ఫీజును చెల్లించాలి.ఇకపోతే వీటికి అదనంగా రాకపోకల ఖర్చులు కూడా వసూలు చేయనున్నారు జిల్లా అధికారులు. ఇందుకోసం ఒక్క కిలోమీటర్‌కు రూ.80 చొప్పున ప్రయాణ ఛార్జీల చెల్లించాల్సి ఉంటుంది. ఈ బ్యాండ్ బుకింగ్ కోసం పోలీస్ కంట్రోల్ రూమ్‌తో పాటు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నంబరు (8054942100)ను కూడా ఏర్పాటు చేశారు పోలీసులు.