Punjab Governor vs CM Supreme Court : అసెంబ్లీలో పాసైన బిల్లులను ఆమోదించకుండా పంజాబ్ గవర్నర్ అట్టిపెట్టుకోవడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. గవర్నర్ నిప్పుతో చెలగాటమాడుతున్నారని అసహనం వ్యక్తం చేసింది. అదే సమయంలో, పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వ తీరును సైతం తప్పుబట్టింది. అసెంబ్లీ సమావేశాలను ప్రొరోగ్ చేయడానికి బదులుగా, వాయిదా వేసి ఊరుకోవడానికి కారణమేంటని ప్రశ్నించింది. సంప్రదాయాలపై దేశం నడుస్తోందని, వాటిని అనుసరించాల్సిన అవసరం ఉందని పంజాబ్ ప్రభుత్వం, గవర్నర్‌కు స్పష్టం చేసింది.
'మేమే ఉత్తర్వులు జారీ చేస్తాం'
'పంజాబ్‌లో జరుగుతున్నదాని పట్ల మేం సంతోషంగా లేము. ఇది చాలా తీవ్రమైన అంశం' అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అసెంబ్లీ పంపిన బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్ జాప్యం చేస్తున్నారని పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. బిల్లులకు గవర్నర్ ఆమోదానికి సంబంధించిన చట్టంలోని వివాద పరిష్కారానికి తాము ఉత్తర్వులు జారీ చేస్తామని .
"ప్రజాస్వామ్యం కొనసాగడం ముఖ్యమంత్రి, గవర్నర్ చేతుల మీదగానే సాధ్యం. శాసనసభ నియమాలను ఎవరూ అతిక్రమించలేరు. పంజాబ్‌లో ప్రభుత్వం చేస్తున్న పని కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. గవర్నర్ తీరు పట్ల కూడా మేం సంతృప్తిగా లేము. బిల్లులు పాస్ చేయకుండా సమావేశాలే రాజ్యాంగ విరుద్ధమని గవర్నర్ చెప్పడమంటే.. నిప్పుతో చెలగాటం ఆడినట్లే. పంజాబ్‌లో జరుగుతున్నది చాలా తీవ్రమైన అంశం."
-సుప్రీంకోర్టు
'గవర్నర్ ప్రజాప్రతినిధి కాదు'
ఇదే అంశంపై నవంబర్ 6న జరిగిన విచారణలోనూ.. గవర్నర్ అధికారాలపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. తాము ప్రజాప్రతినిధులం కాదనే విషయాన్ని విస్మరించరాదని స్పష్టం చేసింది. అసెంబ్లీలు పంపిన బిల్లులను గవర్నర్లు ఆమోదించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. పంజాబ్ అసెంబ్లీ పంపిన బిల్లులపై గవర్నర్ ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది.
జర్నలిస్టులకు రక్షణ..
మరోవైపు.. అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ వివాదంపై కథనాలు రాసిన ఇద్దరు జర్నలిస్టులకు పోలీసుల నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గుజరాత్ పోలీసులు తమకు జారీ చేసిన సమన్లను వ్యతిరేకిస్తూ బెంజమిన్ నికోలస్ బ్రూక్ పార్కిన్, క్లోయి నినా కార్నిష్ అనే ఇద్దరు జర్నలిస్టులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీం.. ఇద్దరిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో, విచారణకు సహకరించాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది. ఇటీవల రవి నాయర్, ఆనంద్ మంగ్నలే అనే ఇద్దరు జర్నలిస్టులకు సైతం మధ్యంతర రక్షణ ఇచ్చింది సుప్రీం.
'పరిష్కారం కనుక్కోవాల్సిందే'
వాయు కాలుష్యానికి సంబంధించిన కేసులో.. దిల్లీ సరిహద్దులో ఉన్న రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనాన్ని ఆపాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో కాలుష్యం తగ్గించేందుకు పరిష్కారం కనుగొనాల్సిందేనని నొక్కి చెప్పింది. కాలుష్యం సమస్యపై వివిధ కమిటీల నివేదికలు ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఏమీ జరగడం లేదని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంన్షు ధులియా, జస్టిస్ అహ్సానుద్దీన్ అమనుల్లా నేతృత్వంలోని ధర్మాసనం ఆక్షేపించింది. తాము కాలుష్యం తగ్గింపునకు సంబంధించిన ఫలితాలు చూడాలనుకుంటున్నామని పేర్కొంది.
'చట్టసభ్యులపై క్రిమినల్ కేసుల విచారణలో జాప్యం వద్దు'- ప్రత్యేక బెంచ్‌ల ఏర్పాటుకు సుప్రీం ఆదేశం
'పార్టీలకు అధికారికంగా ముడుపులిచ్చే సాధనం కాకూడదు'- ఎన్నికల బాండ్ల కేసుపై సుప్రీం తీర్పు రిజర్వు