Punjab Elections 2022: అయిదు నదుల రాష్ట్రం పంజాబ్ అసెంబ్లీలోని 117 స్థానాలకు ఎన్నికలు ఒకే విడతలో నేడు (ఆదివారం) జరగనున్నాయి. ఈసారి అక్కడ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అతిపెద్ద పక్షంగా అవతరించి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని ముందస్తు ఎన్నికల సర్వేలు కోడై కూస్తున్నాయి. ఆప్‌కు గట్టి పోటీనిస్తూ కాంగ్రెస్ రెండో స్థానంలో నిలుస్తుందని జోస్యం చెబుతున్నాయి. మరోవైపు భారతీయ జనతా పార్టీ (భాజపా), కెప్టెన్ అమరీందర్ సింగ్ స్థాపించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్, సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ (యునైటెడ్)లు ఒక జట్టుగా బరిలోకి దిగాయి. ఎన్నికల్లో ఈ కూటమి పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదన్నది విశ్లేషకుల మాట. మరోవైపు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) సైతం వెనకంజలోనే ఉందన్న కథనాలు వినిపిస్తున్నాయి.
Punjab Elections Predictions: పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ వీడియో ఒకటి బాగా చర్చనీయాంశమైంది. స్వతంత్ర ఖలిస్థాన్ దేశం ఏర్పడితే దానికి తాను ప్రధాని అవుతానని 2017 ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ తనతో చెప్పినట్లు కుమార్ విశ్వాస్ ఆ వీడియోలో ఆరోపించారు. ప్రతిపక్షాలకు అది మంచి అస్త్రంగా మారింది. అన్ని పార్టీలూ కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డాయి. ఖలిస్థాన్ మద్దతుదారులకు తాను అనుకూలమో కాదో కేజ్రీవాల్ స్పష్టతనివ్వాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ డిమాండు చేశారు. కేజ్రీవాల్‌పై దేశద్రోహ నేరం మోపాలని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ మండిపడ్డారు. ఆయన వాఖ్యలపై విచారణ జరపాలని గళమెత్తారు. కుమార్ విశ్వాస్ వ్యాఖ్యలను ఆప్ అధినేత తేలిగ్గా కొట్టిపారేశారు. నిజానికి 2017 ఎన్నికల సమయంలోనే పంజాబ్ ఓటర్ల ఆదరాన్ని 'ఆప్' చూరగొనగలిగింది. పేరు గడించిన ఒక ఖలిస్థాన్ తీవ్రవాది ఇంటిని కేజ్రీవాల్ సందర్శించాక పరిస్థితి మారిపోయింది. ఆ ఎన్నికల్లో తమ పార్టీ 80 స్థానాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆప్ అంతకుముందు ఘనంగా ప్రకటించుకుంది. కానీ, వాస్తవంలో 20 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తరవాత చాలామంది ఆప్ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి జారుకున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఆప్ సాధించిన ఓట్ల శాతం ఒక అంకెకే పరిమితమైంది. ఈసారి ప్రజల అభిమానం ఆ పార్టీపై ఓట్ల రూపంలో ఎంతవరకూ వర్షిస్తుందో వేచి చూడాలి.
parties strategies in Punjab: ఈ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ కోణంలోనూ భాజపా యోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఆప్‌కు సీట్లు తగ్గి, కాంగ్రెస్ సైతం మెజారిటీ స్థానాలను(59) దక్కించుకోలేకపోతే ఆ తరవాత కమల దళం పావులు కదపవచ్చు. పంజాబ్‌లో డేరాల ప్రభావం ఎక్కువ. అక్కడి ఆరు డేరాలు 68 అసెంబ్లీ స్థానాల్లో ప్రభావం చూపగలవని భావిస్తున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ- రాధా స్వామి సత్సంగ్ అధిపతి బాబా గురీందర్ సింగ్‌తో భేటీ అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సైతం ఆయన్ను కలిశారు. అమృత్‌సర్‌లో అకాల్ తఖ్త్ బాధ్యులు జ్ఞాని హర్‌ప్రీత్ సింగ్‌నూ కలిశారు. నూర్ మహల్ డేరా (దివ్య జ్యోతి జాగరణ్ సంస్థాన్), డేరా సచ్‌ఖండ్ బల్లాన్, సంత్ నిరంకారి మిషన్ తదితర అధిపతులతో భాజపా నేతలు మంతనాలు సాగిస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. డేరాల మద్దతుతో 25 స్థానాలను గెలుచుకోగలనని భాజపా భావిస్తోంది. గత ఎన్నికల్లో 15 స్థానాలనే సాధించిన ఎస్‌ఏడీ సైతం ఈసారి పుంజుకోవచ్చని అంచనావేస్తోంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఎస్‌ఏడీ, రాష్ట్రీయ లోక్ కాంగ్రెస్, ఎస్‌ఏడీ(యునైటెడ్)తో జట్టుకట్టి మెజారిటీని సాధించే అవకాశం ఉంటుంది. ఎస్‌ఏడీ, భాజపా మధ్య పాత స్నేహాన్ని పునరుద్ధరింపజేయడంలో డేరాల అధినేతలు కీలక పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు! మొత్తానికి పంజాబ్‌లో అధికారం ఎవరికి దక్కుతుందన్నది ఫలితాల తరవాతే తేలుతుంది.
- శ్రీనంద్ ఝా
ఇదీ చదవండి: Punjab polls: పంజాబ్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. గెలుపుపై పార్టీల ధీమా