పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్-డీఎంకే కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవడంలో ముఖ్యమంత్రి నారాయణస్వామి విఫలమయ్యారు. విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం.. ఓటింగ్‌కు ముందు అధికార పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వాక్ఔట్ చేశారు. ఫలితంగా ఓటింగ్‌కు ముందే ప్రభుత్వం కూలిపోయింది.
వరుస రాజీనామాలతో..
పుదుచ్చేరి శాసనసభలో కాంగ్రెస్-డీఎంకే కూటమి ప్రభుత్వం.. విశ్వాస తీర్మానంలో గట్టక్కలేకపోయింది. వరసగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం వల్ల.. లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై బలనిరూపణ చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు.. ప్రత్యేకంగా సమావేశమైన సభలో ముఖ్యమంత్రి నారాయణస్వామి.. విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభలో ప్రసంగించిన ఆయన.. భాజపా తీరుపై మండిపడ్డారు. డీఎంకే సహా.. స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్న ఆయన ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ గెలిచామని చెప్పారు.
పుదుచ్చేరిలో తాము రెండు భాషల విధానం అమలుచేయగా.. కేంద్రంలోని భాజపా సర్కార్ బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కేంద్రం, ప్రతిపక్షాలతో కుమ్మక్కైన.. మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేదీ.. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించారని నారాయణస్వామి ఆరోపించారు. నిధులు ఇవ్వకుండా.. కేంద్ర ప్రభుత్వం పుదుచ్చేరి ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు.