సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న రైతులు.. తమ పంట ఉత్పత్తులను పార్లమెంట్ భవనం వద్దే విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ అన్నారు. జైపుర్లోని విద్యానగర్ స్టేడియంలో జరిగిన 'కిసాన్ మహాపంచాయత్'లో ప్రసంగించారాయన.
రైతులు తమ పంటల్ని అమ్మేందుకు పార్లమెంటుకు వెళతారన్న టికాయత్.. అవసరమైనప్పుడు దిల్లీకి వెళ్లేందుకు సంసిద్ధంగా ఉండాలని అక్కడి రైతు సంఘాలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యలను ఉటంకించారు.
''మళ్లీ అవసరమైనప్పుడు దిల్లీకి వెళ్లేందుకు మీరు సిద్ధంగా ఉండాలి. మరోసారి బారికేడ్లకు ఎదురెళ్లాలి. రైతులు ఎక్కడైనా తమ పంటను అమ్ముకోవచ్చని ప్రధాని చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీలు, కలెక్టర్ కార్యాలయాలు, పార్లమెంట్ వద్ద పంట ఉత్పత్తులను అమ్మి దానిని నిజం చేస్తాం. పార్లమెంటును మించిన మండీ ఇంకోటి లేదు.''
- రాకేశ్ టికాయత్, బీకేయూ నేత
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం ప్రారంభమైందని, ప్రస్తుతం యువకులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారని టికాయత్ చెప్పారు. రైతులంతా ఐక్యంగానే ఉన్నామని, విడిపోయే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. వాతావరణం సహకరించనందున.. అనుకున్న సమయానికంటే ముందుగానే తన ప్రసంగాన్ని ముగించారు టికాయత్.
ఈ సందర్భంగా.. జాట్ నాయకుడు రాజారామ్ మీల్ను భారతీయ కిసాన్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు టికాయత్. జాబర్ సింగ్కు జాతీయ కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు.
ఇదీ చదవండి: 'ఏ పార్టీకైనా ఓటేయండి- భాజపాకు మాత్రం వేయకండి'