ఆయనది ఓ పల్లెటూరు. జన్మించింది సామాన్య రైతు కుటుంబంలో. చదివింది వీధి బడిలో. ఆ స్థాయి నుంచి నేడు దేశ సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి స్థాయిని అందుకున్నారు తెలుగుతేజం జస్టిస్ నూతలపాటి వెంకట రమణ. మూడు దశాబ్దాల న్యాయవాద జీవితంలో.. రాజ్యాంగ, క్రిమినల్, సర్వీస్, అంతర్రాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసుల్లో నిష్ణాతులుగా పేరు గడించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేసిన ఆయన.. భారత దేశ 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
న్యాయవాద ప్రస్థానం..
1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు జస్టిస్ ఎన్.వి. రమణ. సివిల్, క్రిమినల్ చట్టాలతో పాటు రాజ్యాంగపరమైన అంశాలలో ఆయన దిట్ట. రాజ్యాంగపరమైన వివాదాలు, కార్మిక చట్టాలు, ఎన్నికల సర్వీసులకు సంబంధించిన కేసులపై న్యాయవాదిగా హైకోర్టు, సుప్రీంకోర్టులతో పాటు.. కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రైబ్యునళ్లలో వాదనలు వినిపించారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున.. అదనపు స్టాండింగ్ కౌన్సెల్‌గానూ, హైదరాబాద్‌లోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌లో రైల్వేశాఖకు స్టాండింగ్ కౌన్సెల్‌గానూ పనిచేశారు జస్టిస్ రమణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదనపు అడ్వొకేట్ జనరల్‌గానూ సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ అధ్యక్షుడిగానూ పనిచేశారు.
న్యాయవాద జీవితంలో జస్టిస్ ఎన్.వి. రమణ.. ప్రజా సమస్యల పరిష్కారానికే అధిక ప్రాధాన్యమిచ్చారు. ప్రజా సమస్యలపై పత్రికా కథనాలను సుమోటోగా విచారణకు స్వీకరిస్తూ జనం పక్షాన నిలిచారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేశారు. కేసుల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యమిచ్చేవారు.
వక్తగానూ...
న్యాయవాదిగా, న్యాయమూర్తిగానే కాకుండా.. జస్టిస్ ఎన్.వి.రమణకు మంచి వక్తగానూ పేరుంది. పలు అంతర్జాతీయ, జాతీయ సదస్సుల్లో పాల్గొని ఉపన్యసించారు. న్యాయ సంబంధింత అంశాలపై.. పత్ర సమర్పణ చేశారు. మహిళా సాధికారత, న్యాయవ్యవస్థ క్రియాశీలత, పర్యావరణం-అభివృద్ధి, పరిరక్షణ, కోర్టులు-ప్రత్యామ్నాయాలు, 21వ శతాబ్దంలో మానవహక్కులకు ఎదురవుతున్న సవాళ్లు, అంగవైకల్యం, వికలాంగుల మానవహక్కులు, భారత్‌లో నేరన్యాయ వ్యవస్థ వంటి అంశాలపై నిర్వహించిన వర్క్‌షాపుల్లో పాల్గొన్నారు. బ్రిటన్, అమెరికా ఆహ్వానంతో ఆయా దేశాల్లో న్యాయవ్యవస్థ పనితీరుపై అధ్యయనం చేశారు.