చిన్నచిన్న తప్పులు కలిసి ఓ పెనుముప్పుగా మారడం అంటే ఏమిటో కోజీకోడ్ విమాన ప్రమాద దర్యాప్తు నివేదికను(kozhikode plane crash report) చూస్తే తెలుస్తుంది. ఒక వైపర్ తగినంత వేగంతో పనిచేయకపోవడం, పైలట్ల మధ్య సమన్వయం దెబ్బతినడమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.
కోజికోడ్‌లో గతేడాది ఆగస్టులో జరిగిన విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) నివేదిక(kozhikode plane crash investigation) ఇచ్చింది. ఈ ప్రమాదంలో పైలట్, కో-పైలట్ సహా 21 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో 186 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో పలువురు గాయాలతో బయటపడ్డారు.
పైలట్ తప్పు కొంత ఉండొచ్చు..
ఈ ప్రమాదంపై ఏఏఐబీ 257 పేజీల నివేదిక ఇచ్చింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌లోని కొన్ని నిబంధనలను పైలట్ విస్మరించడమే కారణమై ఉండవచ్చని అభిప్రాయపడింది. పైలట్ అస్థిర విధానాలను అవలంభించడంతోపాటు.. విమానం టచ్ జోన్ (నేలపైకి దిగాల్సిన ప్రదేశం) దాటి సగం రన్‌వేలోకి వెళ్లి ల్యాండ్ చేయడం వంటివి ఉన్నాయి. అంతేకాదు.. ‘పైలట్ మానిటరింగ్’ నుంచి 'గో అరౌండ్'(మరో సారి గాల్లో చక్కర్లుకొట్టమని) సూచనలను అమలు చేయలేకపోవడం కూడా మరో కారణమైంది. కీలకమైన విమాన వ్యవస్థలు మొత్తం సాధారణంగానే పనిచేశాయి. అయినా.. ఏదైన వ్యవస్థల్లో వైఫల్యం జరిగి ఉండొచ్చనే అంశాన్ని కొట్టిపారేయలేమని పేర్కొంది.
ల్యాండింగ్ దూరంపై చర్చించలేదు..
పైలట్ ఇన్ కమాండ్ స్థానంలో ఉన్న కెప్టెన్ సేథీ అందుబాటులో ఉన్న ల్యాండింగ్ దూరంపై చర్చించకుండానే ల్యాండింగ్ ఫ్లాప్స్, ఆటోబ్రేక్ సెలక్షన్ వాడారు. ఇది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉల్లంఘనే. రన్‌వే 10పై ల్యాండింగ్ సమయంలో టెయిల్ విండ్, వర్షం ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు. ల్యాండింగ్ డిస్టెన్స్‌ను లెక్కగట్టడాన్ని కూడా విస్మరించారు.
మొరాయించిన విండ్ షీల్డ్ వైపర్..
పైలట్ ఇన్ కమాండ్ స్థానంలో కూర్చున్న వైపు ఉన్న విండ్ షీల్డ్ వైపర్ మొరాయించింది. తొలిసారి ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన సమయంలో ఆగిపోయింది. ఇది సక్రమంగా పనిచేయడం లేదన్న విషయంపై పైలట్ ఇన్ కమాండ్‌కు ముందే కొంత సమాచారం ఉందన్న నిర్ధారణకు వచ్చారు. ఆయన ఫ్లైట్ ఆఫీసర్‌తో చేసిన సంభాషణ సీవీఆర్ రికార్డులే దీనికి ఆధారం
ఈ విమానం రన్‌వే 28 వైపు ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన సమయంలో విండ్‌షీల్డ్ వైపర్ కేవలం 27 సెకన్లు మాత్రమే పనిచేసింది. ఆ తర్వాత రన్‌వే10పై దిగేందుకు ప్రయత్నించిన సమయంలో కూడా ఇది చాలా నిదానంగా పనిచేసింది. రన్‌వే పై దిగిన సమయంలో భారీగా వర్షం కురుస్తున్నా.. సరిగా పనిచేయని వైపర్‌తోనే నెట్టుకొచ్చారు.
భారీ వర్షం పడుతుండటంతో రన్‌వే 28పై దిగేందుకు పైలట్ ఒక విఫలయత్నం చేశారు. ఈ విషయాన్ని ఏటీసీకి వివరించారు. వాతావరణం అనుకూలించకపోవడం, భారీ వర్షం కారణాలుగా పేర్కొన్నారు.
ముప్పును అంచనా వేయడంలో వైఫల్యం..
ఒక సారి రన్‌వే 28పై ల్యాండింగ్‌కు విఫలయత్నం చేసిన తర్వాత కూడా పైలట్ ఇన్ కమాండ్ (ప్రధాన పైలట్) ముప్పును సరిగా అంచనా వేయలేదు. తగినంత ఇంధనం ఉన్నా విమానాన్ని దారి మళ్లించడానికి ఆసక్తి చూపలేదు. రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించారు. మరోపక్క ఫ్లైట్ ఆఫీసర్ స్థానంలోని వారు కూడా ఎస్‌వోపీ ఉల్లంఘనను ప్రధాన పైలట్ దృష్టికి తీసుకురాలేదు. అదే సమయంలో పైలట్ మానిటరింగ్ స్థానంలోని వారు కూడా క్యాబిన్‌లోని సిబ్బంది కచ్చితంగా పాటించాల్సిన విధివిధానాలను నిర్దేశించలేదు. ఫలితంగా టెయిల్ విండ్ పరిస్థితుల్లో.. భారీ వర్షం పడుతున్న టేబుల్‌టాప్ రన్‌వే పై ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించి విమానం ప్రమాదానికి గురైంది.
అసలేమిటీ టేబుల్ టాప్ రన్‌వే?
టేబుల్ టాప్ రన్‌వే.. పేరుకు తగినట్టుగానే టేబుల్ ఉపరితలం మాదిరిగానే ఉంటుంది. కొండ లేదా ఎత్తైన ప్రదేశంలో చదునుగా ఉండేచోట ఈ తరహా రన్‌వేలు ఏర్పాటు చేస్తారు.అందువల్ల ఈ రన్‌వేలకు ముందు, వెనుకా కొండలు, లోయలు ఉంటాయి. సాధారణ విమానాశ్రయాల్లో ఉండే రన్‌వేలతో పోలిస్తే వీటి నిడివి కూడా చాలా తక్కువ. అత్యంత నైపుణ్యం కలిగిన పైలట్లకు సైతం ఇక్కడ విమానాలను ల్యాండ్ చేయడం పెద్ద సవాలే. పైలట్లు వెంట్రుకవాసి తప్పిదం చేసినా విమానానికి ఘోర ప్రమాదం తప్పదు. అందుకే విమానాశ్రయం రన్‌వేకు రెండు చివరలలో కొంత స్థలం ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. కొజికోడ్‌లో అలా అదనంగా స్థలం లేదని చెబుతున్నారు. పరిమితమైన భూభాగం ఉండటం వల్ల విమానం ల్యాండింగ్ సమయంలో ఎంతో అప్రమత్తత అవసరం. టేబుల్ టాప్ రన్‌వేలకు ఎయిర్‌ఫీల్డ్ చుట్టూ రోడ్ల సమస్య కూడా ఉంది. విమాన ప్రమాదం సమయంలో వీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇరుకైన రహదారుల కారణంగా సహాయక చర్యల ఆలస్యానికి సైతం కారణమవుతాయి.
ఓవర్ షూట్ అంటే ఏమిటీ..?
వందల కిలోమీటర్ల వేగంతో గాల్లో ప్రయాణిస్తున్న విమానం దిగే సమయంలో తొలుత రన్‌వేపై ఏ ప్రదేశం నుంచి ఏ ప్రదేశం మధ్యలో నేలను తాకాలో ముందుగానే నిర్ణయించి మార్కింగ్ చేసి ఉంచుతారు. ఒక వేళ విమానం ఈ మార్కింగ్ ప్రదేశాన్ని దాటి బాగా ముందుకు వెళ్లిపోయి నేలను తాకితే.. ఆగటానికి అదనపు రన్‌వే అవసరం అవుతుంది. దీనిని ఓవర్ షూట్ అంటారు. వర్షం పడే సమయంలో రన్‌వే స్పష్టంగా కనిపించకపోవడం వంటి కారణాలతో ఇటువంటి పరిస్థితి తలెత్తవచ్చు. కోజికోడ్‌లో వందేభారత్ మిషన్ విమానం నిర్ణీత ప్రదేశాన్ని దాటి బాగా ముందుకు వెళ్లి నేలను తాకింది. అక్కడి నుంచి ముందుకు వెళ్లిన విమానం తగినంత అదనపు రన్‌వే అందుబాటులో లేకపోవడంతో లోయలోకి వెళ్లిపోయింది.
టెయిల్ విండ్ అంటే..?
విమానాలు ఎగరడానికి హెడ్‌విండ్ (ఎదురు గాలి) ఉపయోగపడుతుంది. అదే విమానం ప్రయాణించే దిశలో వీచే గాలిని టెయిల్ విండ్ అంటారు. ఈ గాలి వల్ల విమానం వేగం ఒక్కసారిగా పెరిగిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇక క్రాస్‌విండ్ అంటే విమానం పక్క నుంచి గాలి వీయడం. ఇది విమాన గమనాన్ని అస్థిరపర్చే ప్రమాదం ఉంటుంది. అందుకే పైలట్లు సాధ్యమైనంత వరకు ఈ పరిస్థితిని తప్పించడానికే ప్రయత్నిస్తారు.
టైర్లపై నియంత్రణ కోల్పోయేదిలా..
రన్‌వేపై విమానం నేలను తాకి సురక్షితంగా ముందుకెళ్లాలంటే టైర్లపై పైలట్లకు నియంత్రణ ఉండాలి. సాధారణంగా భారీ వర్షాలు పడుతున్నప్పుడు రన్‌వేపై నీరు నిలుస్తుంది. అలాంటి ప్రదేశాల్లో విమానం నేలపైకి దిగితే టైర్లకు ఉండే బ్రేకింగ్ వ్యవస్థ సక్రమంగా పనిచేయదు. సాధారణంగా నీరు ప్రవహిస్తున్న రోడ్డుపై వేగంగా ప్రయాణిస్తున్న కారుకు బ్రేకు వేస్తే ఏ విధంగా నియంత్రణ కోల్పోతుందో అటువంటి పరిస్థితే రన్‌వేపై పైలట్లకు ఎదురవుతుంది. దీనిని 'ఆక్వాప్లైనింగ్' అంటారు.
ఇవీ చూడండి: కేరళ విమాన ప్రమాదం- ఆ నలుగురూ సేఫ్