ఉత్తర్‌ప్రదేశ్ ఝాన్సీలో నన్లను కొందరు యువకులు వేధించిన ఘటనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. భాజపా, ఆర్ఎస్ఎస్లకు మహిళలంటే గౌరవం లేదని విమర్శించారు. కేవలం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనను ఖండించారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలను వారు ఎప్పుడూ ప్రోత్సహిస్తారని మిర్శించారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లం జిల్లా కరునాగపల్లిలో ర్యాలీలో పాల్గొన్నారు ప్రియాంక. రైళ్లలో నన్లపై వేధింపులకు పాల్పడి, ఐడెంటిటీ కార్డు చూపించాలని అడిగే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు.
"మీ మతమేంటని నన్లను అడిగే హక్కు ఎవరిచ్చారు? మహిళలు రైళ్లలో వేధింపులు ఎదుర్కోకుండా ప్రయాణించే పరిస్థితి దేశంలో లేదా? మీ వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించిన విషయాలపై కొంతమంది గూండాలకు సమాధానం చెప్పాలా? మహిళలకు రక్షణ కల్పిస్తామని భాజపా, ఆర్ఎస్ఎస్ బూటకపు ప్రకటనలు చేస్తాయి. కానీ వాళ్లకు మహిళలంటే గౌరవమే లేదు. కేవలం ఎన్నికల సమయంలోనే ఓట్ల కోసం మహిళలు ఏం ధరించాలి, ఏం చేయాలి, ఎక్కడికి ఎలా వెళ్లాలి అని వారు చెబుతారు. వాళ్ల మంత్రులు మహిళలు వేసుకునే జీన్స్ గురించి మాట్లాడుతారు. మహిళలు వేరే జిల్లాలకు ప్రయాణించే ముందు పోలీసుల వద్ద రిజిస్టర్ చేసుకునేలా చట్టం తీసుకురావాలని మరో మంత్రి అంటారు. వాళ్లు అమ్మ, సోదరి, బేటీ అని పిలుస్తారు తప్ప మహిళగా గుర్తించి గౌరవం ఇవ్వరు. కానీ ఈ దేశానికి, రాష్ట్రానికి, సమాజానికి, మహిళలే బలం. మనం అమ్మలం, భార్యలం, కూతుళ్లం, అక్కా చెల్లెళ్లం అయినందుకు గర్వ పడాలి. వీటన్నింటికంటే మనం మహిళలైనందుకు గర్వించాలి.
-ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.
కేంద్రంలో భాజపా సర్కార్‌ను బలహీనమైనదిగా అభివర్ణించారు ప్రియాంక. వారు ఒక జోక్‌ను కూడా సహించలేరని విమర్శించారు. ఎగతాళి చేయకముందే కమేడియన్ను అరెస్టు చేస్తారని ఆరోపించారు. అసమ్మతి, వాదనలు, ఎదిరించి నిలబడటం వంటి వాటిని తట్టుకోలేరని చెప్పారు.
రోడ్ షో..
అంతకుముందు అలప్పుజలో భారీ రోడ్ షో నిర్వహించారు ప్రియాంక. కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఆమె కేరళ చేరుకున్నారు.
ఇదీ చూడండి: 'ఇది దేశ ప్రతిష్ఠను దిగజార్చే ఘటన'