Priyanka Gandhi Speech in Hyderabad : హైదరాబాద్ సరూర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సంఘర్షణ సభకు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా సభకు చేరుకున్న ఆమెకు రాష్ట్ర ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, సభకు తరలివచ్చిన అభిమానులకు ప్రియాంక గాంధీ అభివాదం చేస్తూ సభపైకి చేరుకున్నారు. జై బోలో తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులు ఏ ఆకాంక్షల కోసం ఉద్యమం చేశారో.. ఆ లక్ష్యం నెరవేరలేదని ప్రియాంక గాంధీ ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని.. శ్రీకాంతాచారి లాంటి ఎంతో మంది విద్యార్థులు రాష్ట్రం కోసం ప్రాణాలు వదిలారని గుర్తు చేశారు. అమరవీరుల ఆకాంక్షలు నెరవేరాలనే సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటు చేశారని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని భావించామని.. కానీ అది జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగాలు భర్తీ చేయలేదు కానీ.. పేపర్ లీక్ చేశారు..: రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి పట్టడం లేదని ప్రియాంక గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారని.. మీ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా అని యువతను ప్రశ్నించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారన్న ఆమె.. రూ.3016 నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు. ఉద్యోగాలు భర్తీ చేయలేదు కానీ.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ చేశారని విమర్శించారు.
ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత యువతపై ఉంది..: తెలంగాణను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత, బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర యువతపై ఉందని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఎన్నికల వేళ విజ్ఞతతో వ్యవహరించకపోతే నష్టపోయేది ప్రజలేనని తెలిపారు. యువతను జాగృతం చేయడానికే ఇక్కడికి వచ్చానన్న ప్రియాంక గాంధీ.. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. హామీలు నెరవేర్చకపోతే పక్కన పెట్టేయండన్నారు. సోనియమ్మ బిడ్డగా మాట ఇస్తున్నానని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో యూత్ డిక్లరేషన్ అమలు చేసి తీరతామని స్పష్టం చేశారు. అనంతరం హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌ను ప్రియాంక గాంధీ విడుదల చేశారు.
షెడ్యూల్‌లో మార్పులు..: సరూర్‌నగర్ సభ ఆలస్యం కారణంగా ప్రియాంక గాంధీ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. సూర్యాస్తమయం కావడంతో ఆమె రోడ్డు మార్గాన బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి పయనమయ్యారు.
ఇవీ చూడండి..
కర్ణాటకలో ముగిసిన ప్రచార పర్వం.. కన్నడ ఓటర్ల మన్ననలు ఎవరికో?
Govt on JPS Strike : 'రేపు సాయంత్రం వరకు విధుల్లో చేరకపోతే తొలగిస్తాం'