మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్ ఇప్పటినుంచే వ్యూహరచన మొదలుపెట్టాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను(Priyanka Gandhi News) ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆమె నేతృత్వంలోనే కాంగ్రెస్.. యూపీ ఎన్నికలకు(UP Assembly elections 2022) వెళ్లనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వెల్లడించారు.
'యూపీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ ప్రియాంక గాంధీ నేతృత్వంలో బరిలోకి దిగనుంది. మా పార్టీ గెలుపు కోసం ఆమె శ్రమిస్తున్నారు. ఆమెను సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికైతే దీనిపై స్పష్టత లేదు' అని ఓ సల్మాన్ ఖుర్షీద్ ఓ జాతీయ మీడియాతో అన్నారు. యూపీ ఎన్నికల్లో తాము ఏ పార్టీతో కూటమి ఏర్పాటు చేయబోవట్లేదని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను దించనున్నట్లు తెలిపారు. ఎవరైనా తమతో చేతులో కలిపేందుకు సిద్ధంగా ఉంటే.. వారిని సాదరంగా ఆహ్వానిస్తామన్నారు.
వచ్చే ఏడాది ఆరంభంలో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు(UP Assembly Elections) జరగనున్నాయి. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో 403 శాసనసభ నియోజకవర్గాలుండగా.. భాజపా 312 చోట్ల జయకేతనం ఎగురవేసింది. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ 47, బహుజన్‌సమాజ్ పార్టీ 19 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్‌కు కేవలం 7 సీట్లు మాత్రమే దక్కాయి.
ఇదీ చదవండి: 'కాంగ్రెస్‌లో మేం కోరుకున్న ప్రక్షాళన మొదలైంది'