ప్రైవేటు ఆసుపత్రులు ఇకపై కొవిడ్ టీకాలను తయారీదారుల నుంచి నేరుగా కొనుగోలు చేయలేవు. కేంద్రం తీసుకొచ్చిన కొవిన్ పోర్టల్‌లో తమకు కావాల్సిన టీకాల ఆర్డర్స్‌ను పొందుపరచాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలు జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి. అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు కొవిన్ పోర్టల్‌లో..' ప్రైవేటు కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రం'(పీసీవీసీ)గా అన్ని ప్రైవేటు ఆసుపత్రులు నమోదు చేసుకోవటం తప్పనిసరని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఓ ప్రకటన జారీ చేసింది.
"నెలలో ప్రైవేటు కేంద్రాల్లో ఎన్ని డోసులు అందుబాటులో ఉన్నాయనేదానిపై.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా వివరాలు అందుతాయి. ఈ లెక్క ప్రకారమే అవసరమైన టీకాల కోసం ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. దీని కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు అవసరం లేదు. ప్రభుత్వ పోర్టల్‌లో కొనుగోలు ఆర్డర్స్‌ను పొందుపరిస్తే సరిపోతుంది. "
- కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.
కీలక అంశాలు..
ఎన్హెచ్ఏ పోర్టల్ ద్వారా ఎలక్ట్రానిక్ మోడ్‌లోనే పేమెంట్ చేయాలి. ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రులకు కేంద్ర ఆరోగ్య శాఖ టీకాలను సరఫరా చేస్తుంది.
నెలవారి వినియోగాన్ని క్రితం నెలలోని ఓ వారంలో గరిష్ఠంగా వినియోగించిన టీకాల ఆధారంగా సరఫరా చేయనున్నారు. ఉదాహరణకు.. 2021, జులై కోసం పీసీవీసీ ఆర్డర్స్ ఇస్తే.. జూన్ 10-16 తేదీల మధ్య 7 రోజులకు టీకాల వినియోగాన్ని లెక్కలోకి తీసుకున్నారనుకుందాం. ఆ వారంలో 630 డోసులు పంపిణీ చేసినట్లు తేలితే.. రోజుకు సగటున 90 డోసులు ఇచ్చినట్లు లెక్క. జులైకి గరిష్ఠంగా.. 90x30x2= 5,400 డోసులు సరఫరా చేసేందుకు వీలుకలుగుతుంది.
ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. పలు ప్రైవేటు ఆసుపత్రులు కొవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్నాయి. నాలుగు విడతల్లో కొవిషీల్డ్ లేక కొవాగ్జిన్ కోసం ఆర్డర్ చేయవచ్చు. ఆర్డర్ చేసిన మూడురోజుల్లోగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి:ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా.. కొత్త ధరలివే!