కరోనాపై పోరులో రాష్ట్రాలకు లాక్‌డౌన్ అన్నది చిట్ట చివరి అస్త్రం మాత్రమే కావాలని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశ ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ దేశాన్ని లాక్‌డౌన్ నుంచి రక్షించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీకా ఉత్పత్తిదారులు, వైద్యులతో సమావేశం అనంతరం.... జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ కరోనాపై పోరులో దేశం విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
"మర్యాద పురుషుడు రాముడు చెప్పినట్లు కరోనా నియమాలు పాటించాలి. పవిత్ర రంజాన్ స్ఫూర్తిని కొవిడ్ కట్టడిలో చూపాలి. రంజాన్ మనకు ధైర్యం, క్రమశిక్షణను బోధిస్తుంది. అదే విధంగా ప్రజలు కరోనాపై పోరులో ధైర్యం, క్రమశిక్షణ ప్రదర్శించాలి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలు వేస్తున్న దేశంగా భారత్ నిలిచిందన్న మోదీ ఇప్పటికే ఫ్రంట్‌లైన్ వారియర్స్, వయోవృద్ధులకు టీకాలు వేశామన్నారు. మే 1 తర్వాత.... 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు.వారికి కూడా టీకాలు వేస్తే నగరాల్లో సత్ఫలితాలు వస్తాయన్నారు.
తేడా ఉంది
గతేడాది కరోనా వెలుగుచూసిన పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి తేడా ఉందని.. మౌలిక వసతుల పరంగా ఎంతో ప్రగతి సాధించామని మోదీ చెప్పారు. ఫ్రంట్‌లైన్ వారియర్లకు, వైద్యులకు, ప్రభుత్వానికి అండగా నిలిచిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. రెండో దశలో కరోనా..... మరింత తీవ్రమైన సవాలు విసురుతోందన్న మోదీ.. తుపానులా ప్రజలపై విరుచుకుపడుతోందని.. అన్నారు.
ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ప్రధాని చెప్పారు. ఫార్మా సంస్థలు ఔషధాల ఉత్పత్తిని పెంచుతున్నాయని ప్రంపంచంలోనే ప్రఖ‌్యాతిగాంచిన ఔషధ సంస్థలు భారత్‌లో ఉన్నాయని చెప్పారు.