PM Modi News: రాజ్యసభ పదవీకాలం పూర్తి చేసుకున్న వివిధ పార్టీలకు చెందిన 72మంది ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ వీడ్కోలు పలికారు. వీరంతా మరోసారి సభకు తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. చదువు ద్వారా పొందిన జ్ఞానం కంటే అనుభవం ద్వారా వచ్చే జ్ఞానమే శక్తిమంతమైందని సభ్యులను ఉద్దేశించి మోదీ అన్నారు. సభలో ఎంతో కాలం గడిపామని, సభకు ఇచ్చినదానికంటే, సభే అందరి జీవితాలకు ఎంతో తోడ్పాటు అందించిందని మోదీ చెప్పారు.
Modi Farewell to Rajya Sabha Members: రాజ్యసభ సభ్యుడిగా పొందిన అనుభవాన్ని దేశ నలుమూలలకు తీసుకెళ్లాలని ఎంపీలకు మోదీ సూచించారు. భావి తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. సభలో సభ్యుల సంఖ్య తగ్గితే మిగతా వారిపై బాధ్యత మరింత పెరుగుతుందని గుర్తు చేశారు. పదవీ కాలం పూర్తయిన 72మంది సభ్యులతో మోదీ, వెంకయ్య, ఓం బిర్లా ఫొటోలు దిగారు. పార్లమెంటు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సభాపక్షనేత మల్లికార్జున్ ఖర్గే సహా ఇతర పార్టీలకు చెందిన ఎంపీలను మోదీ ఆప్యాయంగా పలకరించారు.
![Prime Minister Narendra Modi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14887503_1.jpg)
![Prime Minister Narendra Modi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14887503_4.jpg)
Venkaiah Naidu news: దేశవ్యాప్తంగా ఉన్న చట్టసభ్యులు అంకితభావం, మెరుగైన పనితీరు, విధానపరమైన సమగ్రతతో నడుచుకోవాలని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు సూచించారు. చట్టాలను రూపొందించే సంస్థలకు విఘాతం కలగించకుండా ఉండాలని అన్నారు. సభ్యుల ఆందోళన కారణంగా 2017 నుంచి 35శాతం సభా సమయం వృథా అయిందని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తమకు ప్రసాదించిన గౌరవాన్ని, విశేషాధికారాన్ని నిలబెట్టుకోవాలని కోరారు.
![Prime Minister Narendra Modi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14887503_3.jpg)
RS MPs Retirement: రాజ్యసభలో వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ రద్దు చేశారు. పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఆయా సభ్యులంతా ఇవాళ రాజ్యసభలో ప్రసగించనున్నారు. రోజంతా వారి ప్రసంగాలు కొనసాగనున్నాయి. సాయంత్రం ఉపరాష్ట్రపతి నివాసంలో 72 మంది సభ్యులకు విందు ఏర్పాటుచేశారు. పదవీకాలం పూర్తికానున్న వారిలో ఏకే ఆంటోని, అంబికా సోని, పీ చిదంబరం, ఆనంద్ శర్మ, సురేశ్ ప్రభు, ప్రఫుల్ పటేల్, సుబ్రహ్మణ్యం స్వామి, ప్రసన్న ఆచార్య, సంజయ్ రౌత్, నరేశ్ గుర్జాల్, సతీష్ చంద్ర మిశ్ర, ఎంసీ మేరీ కోమ్, స్వపన్ దాస్ గుప్తా, నరేంద్ర జాధవ్ వంటి ప్రముఖులు ఉన్నారు. తెలుగురాష్ట్రాల నుంచి సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్, సురేశ్ ప్రభు, విజయసాయిరెడ్డి, డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఉన్నారు.
![Prime Minister Narendra Modi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14887503_2.jpg)
ఇదీ చదవండి: ఓటమి నేర్పిన పాఠం.. కాంగ్రెస్లో చలనం