Modi tribute to Atal Bihari Vajpayee: భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వాజ్‌పేయీ అభివృద్ధి కార్యక్రమాలు లక్షలాది మంది భారతీయులపై సానుకూల ప్రభావం చూపాయన్నారు. దిల్లీలోని అటల్ స్మారకం 'సదైవ్ అటల్' వద్ద పుష్పాంజలి ఘటించారు.
" అటల్ జీ జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు. దేశానికి ఆయన చేసిన సేవ స్ఫూర్తిదాయకం. దేశాన్ని పటిష్ఠంగా, అభివృద్ధిమయంగా మార్చేందుకు ఆయన జీవితాన్నే అంకితం చేశారు. ఆయన అభివృద్ధి కార్యక్రమాలు మిలియన్ల మంది భారతీయులపై సానుకూల ప్రభావం చూపాయి. "
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
స్వతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త పండిట్ మదన్ మోహన్ మాలవియా జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు మోదీ. గొప్ప సామాజిక సంస్కర్తగా కొనియాడారు.
రాష్ట్రపతి సహా ప్రముఖుల నివాళి..
మాజీ ప్రధాని వాజ్‌పేయీ జయంతి సందర్భంగా దిల్లీలోని సదైవ్ అటల్ స్మారకం వద్ద నివాళులర్పించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. పుష్పాంజలి ఘటించి స్మరించుకున్నారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
సుపరిపాలన దినోత్సవంగా..
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతిని సుపరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తారు. వాజ్‌పేయీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రాటిక్ అలియన్స్(ఎన్డీఏ) ప్రభుత్వం 1998-2004 వరకు అధికారంలో ఉంది. భాజపా నుంచి ప్రధాని అయిన తొలి నేతగా గుర్తింపు పొందారు వాజ్‌పేయీ. ఆయన మూడు సార్లు ప్రధానిగా సేవలందించారు. 1996లో ప్రధాని అయినప్పటికీ ఆయన ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేదు. మళ్లీ 1998,1999లో ప్రధానిగా ఎన్నికయ్యారు. అనారోగ్య కారణాలతో దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ 2018, ఆగస్టు 16న 93 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయనకు 2015లో ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
ఇదీ చూడండి: Azadi Ka Amrit Mahotsav: నిజాం చెప్పులకు మాలవీయ వేలం...