Modi Covid Review Meet: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహమ్మారిపై పోరు ఇంకా ముగిసిపోలేదని పేర్కొన్నారు. దేశంలో కొవిడ్ పరిస్థితి, వైద్య వ్యవస్థ సన్నద్ధతపై గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తక్కువ వ్యాక్సినేషన్ రేటు, కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవడం, వైద్య మౌలిక వసతులు లేకుండా ఉండే ప్రాంతాల్లో సాయం చేసేందుకు కేంద్ర బృందాలను ఆయా ప్రాంతాలకు పంపాలని అధికారులను ఆదేశించారు.
"కాంటాక్ట్ ట్రేసింగ్, టెస్టుల సంఖ్య పెంచడం, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం, వైద్య మౌలిక వసతులను పెంచుకోవడంపై అధికారులు దృష్టి సారించాలి. కొవిడ్‌పై చురుకైన, ఏకాగ్రత, సమాఖ్య, సహకార పోరాట వ్యూహం అవసరం. ఐటీ పరికరాలు, టెలీ మెడిసిన్, టెలీ కన్సల్టేషన్ వంటి వాటిని సమర్థంగా వినియోగించాలి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
దేశ ప్రజలంతా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని మోదీ సూచించారు. కొవిడ్ నిబంధనలను నిరంతరం పాటించాలని పేర్కొన్నారు. దేశంలో కొవిడ్ నియంత్రణ, ప్రజారోగ్య ప్రతిస్పందన, ఆక్సిజన్ సిలిండర్లు, వైద్యారోగ్య మౌలికవసతులు, పడకలు, మానవ వనరులు వంటి వాటిపై మోదీ సమీక్షించారని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) తెలిపింది. దేశంలో కొవిడ్ పరిస్థితిని మోదీకి అధికారులు వివరించారని చెప్పింది. ప్రధాని నివాసంలో జరుగుతున్న ఈ భేటీకి హోం, ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
దేశంలో బుధవారం నాటికి 236 మందికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 16 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసినట్లు పేర్కొంది.
డెల్టా కంటే మూడు రెట్లు వేగంగా..
Omicron Virus News: ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్‌పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది. డెల్టా రకంతో పోలిస్తే ఈ కొత్త వేరియంట్ కనీసం మూడు రెట్లు అధికంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొంది. అందువల్ల మరింత దూరదృష్టితో వ్యవహరించి డేటాని సమగ్రంగా విశ్లేషించాలని, డైనమిక్‌గా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సూచించారు. మంగళవారం సాయంత్రం ఆయన రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల అధికార యంత్రాంగాలకు లేఖలు రాశారు. ఒమిక్రాన్‌ని కట్టడి చేసేందుకు తక్షణమే వార్‌రూమ్‌లను యాక్టివేట్ చేయాలన్నారు.
నైట్ కర్ఫ్యూ పెట్టండి..
Omicron Virus Restrictions: దేశంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై రాష్ట్రాలు దృష్టిసారించాలని తెలిపారు. ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ముప్పు రాకముందే ఆంక్షలు అమలు చేయాలని అన్నారు. ఈ ఆంక్షలు కనీసం 14 రోజులు అమల్లో ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా రాబోయే పండగ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పండగల వేళ ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టేలా రాత్రి కర్ఫ్యూలను అమలు చేయాలని తెలిపారు.
బూస్టర్ డోసు కావాలంటూ..
Booster Vaccine News: రెండు డోసుల కొవిడ్ టీకా తీసుకున్నవారు బూస్టర్ డోసు తీసుకునేలా ప్రభుత్వం అనుమతించాలని పలుచోట్ల డిమాండ్ వ్యక్తమవుతోంది. చాలా దేశాల్లో బూస్టర్ డోసు పంపిణీ జరుగుతోందని కొందరు చెబుతున్నారు. భారత్ కూడా అదే దిశగా వెళ్లాలని ఆశిస్తున్నారు.
ప్రతిపక్షాల డిమాండ్..
దేశంలో వ్యాక్సిన్ పంపిణీపై ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇప్పటికీ చాలా మందికి టీకా అందలేదని ఆరోపించారు. దేశంలో కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో బూస్టర్ డోసులు ఎప్పుడు అందిస్తారని ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించారు.
ఇవీ చదవండి: