జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాలోని నౌషెరా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పహారా కాస్తున్న సైనికులతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi Diwali with army). ఆర్మీ ప్రధాన కార్యాలయానికి(Modi in Jammu Kashmir) చేరుకున్న మోదీ.. సైనికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సరిహద్దులోని పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు నివాళులర్పించారు ప్రధాని మోదీ. స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు.
ప్రధానిగా కాదు.. కుటుంబ సభ్యుడిగా వచ్చా..
అమర జవాన్లకు నివాళులర్పించిన అనంతరం సైనికులను ఉద్దేశించి మాట్లాడారు మోదీ. తాను ప్రధానిగా ఇక్కడికి రాలేదని.. ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చానని తెలిపారు.
" ప్రతి దీపావళిని మన సరిహద్దులను కాచుకుంటున్న సైనికులతో గడిపాను. ఈరోజు నాతోపాటు దేశ ప్రజల ఆశీస్సులను తీసుకొచ్చాను. భరత మాతకు మన సైనికులు రక్షణ కవచం. మీవల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. పండగల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. కుటుంబ సభ్యులతో దీపావళి జరుపుకోవాలనుకున్నా. అందుకే ఇక్కడికి వచ్చాను. మీ సామర్థ్యం, బలం దేశంలో శాంతి, భద్రతలకు భరోసా కల్పిస్తాయి. సర్జికల్ స్ట్రైక్ సమయంలో ఈ బ్రిగేడ్ పోషించిన పాత్ర.. ప్రతి భారతీయుడికి గర్వకారణం. సర్జికల్ స్ట్రైక్ తర్వాత ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ, దీటైన సమాధానం ఇచ్చాం. మారుతున్న ప్రపంచం, యుద్ధ విధానానికి అనుగుణంగా సైనిక సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలి. "
- నరేంద్ర మోదీ ప్రధానమంత్రి.
భద్రతా బలగాల కోసం రక్షణ సామగ్రి కొనుగోలు కోసం గతంలో సంవత్సరాలు పట్టేదని గత ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు మోదీ. చాలా వరకు దిగుమతులపైనే ఆధారాపడుతున్నామని, కేవలం రక్షణ రంగంలో ఆత్మనిర్భరతతోనే పాత పద్ధతులకు స్వస్తి పలకొచ్చని చెప్పారు. లద్దాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్, జైసల్మేర్ నుంచి అండమాన్ నికోబార్ ద్వీపాల వరకు సరిహద్దు ప్రాంతాల అనుసంధానత ఎంతో మెరుగుపడిందని గుర్తు చేశారు. అన్ని రంగాల్లో మహిళలకు అవకాశం కల్పిస్తున్నామని.. ఇప్పటికే నౌకాదళం, వాయుసేనలో మహిళలు రాణిస్తున్నారని తెలిపారు. అలాగే, సైన్యంలోనూ మహిళలకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, మిలిటరీ కాలేజీల్లోనూ మహిళలకు ప్రవేశం కల్పిస్తున్నామని తెలిపారు.
మిఠాయిలు తినిపించి..
దీపావళి సందర్భంగా జవాన్లకు మిఠాయిలు తినిపించారు ప్రధాని మోదీ. ప్రతి ఒక్కరికీ పండగ శుభాకాంక్షలు తెలిపారు.
2014లో తొలిసారి ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి ఏటా సరిహద్దులకు వెళ్లి జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరపుకొంటున్నారు మోదీ. ఈ ఏడాది కూడా ఆ ఆనవాయితీని కొనసాగించారు. జమ్ముకశ్మీర్‌కు రావటం ఇది నాలుగోసారి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత దీపావళికి కశ్మీర్‌కు రావటం రెండోసారి.
ఇదీ చూడండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు