Ramnath kovind farewell: జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని విభజన రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి ప్రజా సంక్షేమానికి ఏది ముఖ్యమో నిర్ణయించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజకీయ పార్టీలకు హితవుపలికారు. పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణిస్తూ హక్కుల సాధన కోసం ప్రజలు, పార్టీలు గాంధేయ మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ఎంపీలు పార్లమెంటులో చర్చించేటప్పుడు మహాత్ముని అడుగు జాడల్లో నడవాలని సూచించారు. ఆదివారం పదవీ విరమణ చేయబోతున్న రాష్ట్రపతి కోవింద్ గౌరవార్థం పార్లమెంటు సభ్యుల తరఫున లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా శనివారం పార్లమెంటు సెంట్రల్ హాల్లో వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. విధి నిర్వహణలో తనకు సహకరించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లాలకు ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగ సూత్రాలకు లోబడి పార్లమెంటును నడిపిస్తున్న ఉభయ సభాపతులను అభినందించారు.
భిన్నాభిప్రాయాలు సహజం
‘‘కుటుంబంలో మాదిరిగానే పార్లమెంటులోనూ అప్పుడప్పుడు విభిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం సహజం. భవిష్యత్తు మార్గం ఎలా ఉండాలన్నదానిపై పార్టీలు విభిన్న అభిప్రాయాలు కలిగి ఉండొచ్చు. మనమంతా పార్లమెంటు కుటుంబ సభ్యులం. విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిరంతరం పనిచేయాలి. దేశాన్ని విశాల ఉమ్మడి కుటుంబంగా చూస్తే అభిప్రాయ భేదాలను పరిష్కరించడానికి అనేక మార్గాలు కనిపిస్తాయి. లక్ష్యాలను సాధించుకోవడానికి మహాత్మాగాంధీ శాంతి, అహింస పద్ధతిలో సత్యాగ్రహ అస్త్రాన్ని ప్రయోగించారు. ఎదుటి పక్షాన్ని కూడా గౌరవించారు. సమాజంలో అట్టడుగున ఉన్న ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఇప్పటివరకూ ఎంతో చేశాం. చేయాల్సింది చాలా ఉంది. ఈ రోజు సామాన్యులు కూడా విమానాల్లో తిరగగలుగుతున్నారు. భేదభావాల్లేని పరిపాలన ద్వారానే అది సాధ్యమైంది. ఇప్పుడు ప్రతి రంగంలోనూ బాలుర కంటే బాలికలు మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. నూతన జాతీయ విద్యావిధానం ఈ మార్పును మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తుందని విశ్వసిస్తున్నాను’’ అని కోవింద్ పేర్కొన్నారు.
స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ రాష్ట్రపతి కోవింద్ దేశ అత్యున్నత కార్యాలయ స్థాయి, గౌరవాలను పెంచారని కొనియాడారు. ప్రజా ప్రయోజనాలకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రజాసేవ పట్ల ఆయనకున్న నిబద్ధతను చాటిందని పేర్కొన్నారు. పార్లమెంటులోని అన్ని పార్టీలు, అందరు సభ్యులూ రాజ్యాంగ సంరక్షుడిగా ఆయనపై పూర్తి విశ్వాసం కనబరిచారని పేర్కొన్నారు. రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, స్పీకర్ ఓం బిర్లాలు అభినందన పత్రం, జ్ఞాపికను అందజేసి వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ నాయకుడు పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషితోపాటు అన్ని పార్టీల సభ్యులు పాల్గొన్నారు. కోవింద్‌పై పోటీ చేసి ఓడిపోయిన మీరా కుమార్ కూడా హాజరయ్యారు. వేదిక నుంచి వెళ్తున్నప్పుడు రాష్ట్రపతి, ప్రధాని ఆమెతో కొద్దిసేపు ముచ్చటించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీ హాజరుకాలేదు. రాష్ట్రపతి ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
'కోవింద్‌తో కలిసి పని చేయడం ఆనందకరం'... రాష్ట్రపతిగా అయిదేళ్ల పదవీ కాలాన్ని రామ్‌నాథ్ కోవింద్ ఎంతో హుందాగా నిర్వహించారని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కొనియాడారు. కీలక సందర్భాల్లో రాష్ట్రపతి వ్యవహరించిన శైలి ఆయన పనితీరుకు నిదర్శనంగా నిలిచిందన్నారు. ఆయనతో కలిసి పని చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రపతి దంపతులకు ఉప రాష్ట్రపతి శనివారం తన అధికారిక నివాసంలో మర్యాదపూర్వక విందు ఏర్పాటు చేశారు. ఉప రాష్ట్రపతి, ఆయన సతీమణి ఉషమ్మ, కుమారుడు హర్షవర్ధన్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అచ్చ తెలుగు వంటకాలతో రాష్ట్రపతి దంపతులు విందు ఆరగించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రామ్‌నాథ్ కోవింద్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమైనదన్నారు. ఆయన ఆలోచనలు, సందేశాలు, ప్రసంగాల నుంచి ఈ తరం యువత ఎంతో నేర్చుకోవాల్సి ఉందని చెప్పారు.
ఇదీ చూడండి : నదిలో కొట్టుకుపోయిన పులి.. బ్యారేజీ వద్ద చిక్కుకొని...