కరోనా పోరులో ఫ్రంట్‌లైన్ యోధులైన వైద్యులు, పోలీసులు తమ జీవితాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్నారు. వైరస్ ముప్పు ఉందని తెలిసినా.. కరోనా బాధితుల ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇలాగే ఛత్తీస్‌గఢ్‌లో శిల్పా సాహూ అనే మహిళా డీఎస్పీ.. కరోనా సమయంలోనూ రోడ్డుపైకి వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు. దంతెవాడ జిల్లాలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో.. బయటకు వచ్చిన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఐదు నెలల గర్భిణీ ఎవరైనా ఇంట్లో ఉండడానికే మొగ్గుచూపుతారు. అలాంటిది శిల్పా సాహూ మండుటెండల్లోనూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ప్రజలను క్షేమంగా ఉంచేందుకే తాము రోడ్డుమీదకు రావాల్సి వస్తోందని శిల్ప చెబుతున్నారు. అనవసరంగా ప్రజలు బయట తిరగొద్దని సూచిస్తున్నారు.
రోజా సమయంలోనూ గర్భిణీ సేవలు
మరోవైపు, గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన నర్సు నాన్సీ ఐజెన్.. నాలుగు నెలల గర్భంతోనూ కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. రంజాన్ సమయంలో ఉపవాస దీక్షలు కొనసాగిస్తూనే.. తన వృత్తి బాధ్యతను నిష్ఠగా నెరవేర్చుతున్నారు.
కరోనా ముప్పు ఉందని తెలిసినా రోజూ సూరత్‌లోని అటల్ కొవిడ్ సెంటర్లో 8 నుంచి 10 గంటల పాటు పనిచేస్తున్నారు. కరోనా తొలి దశ వ్యాప్తి సమయంలోనూ నాన్సీ ఇక్కడే విధులు నిర్వర్తించారు.
తన కడుపులో పెరుగుతున్న బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటూనే, కరోనా రోగులకు సేవలు చేస్తున్న ఈ నర్సు.. అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. తనకు తన విధి నిర్వర్తించడమే ముఖ్యమని చెబుతున్నారు నాన్సీ.
"నేను ఇంతకు ముందు కూడా ఇక్కడ పనిచేశాను. ఈసారి నా కడుపులో బిడ్డ పెరుగుతోంది. కానీ, నాకు డ్యూటీనే ముఖ్యం. అందుకే నేను నా పని కొనసాగిస్తున్నా. దేవుడి దయ వల్ల పవిత్రమైన రంజాన్ మాసంలో... రోగులకు సేవ చేసే అవకాశం లభించింది."
-నాన్సీ ఐజెన్, నర్సు
గర్భిణీలు ఉపవాస దీక్షను పాటించడమే కష్టమైన పని. అలాంటిది గంటల పాటు ఏమీ తినకుండా.. వ్యాధి సోకిన ఇతరులకు సేవలందించడం అంత సాధారణమైన విషయం కాదని, ఈ విషయంలో నర్సును మెచ్చుకోవాల్సిందేనని స్థానికులు అంటున్నారు.
ఇదీ చదవండి- 'మహా' విలయం- ఒక్కరోజే 67,468 మందికి కరోనా