Prakash Raj Kodaikanal : ప్రముఖ నటులు ప్రకాశ్ రాజ్, బాబీ సింహా అక్రమ నిర్మాణాల కేసుకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. కొడైకెనాల్ మున్సిపాలిటీలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారన్న ఆరోపణలపై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ చేపట్టిన విచారణ సందర్భంగా స్టాలిన్ సర్కారు ఈ మేరకు వివరణ ఇచ్చింది. న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణకుమార్, విజయకుమార్ ఈ పిటిషన్‌పై వాదనలు విన్నారు. రెండు భవనాల నిర్మాణ పనులను నిలిపివేసినట్లు న్యాయస్థానానికి తమిళనాడు సర్కారు తెలిపింది. ఇద్దరిపైనా లీగల్ యాక్షన్ ప్రారంభించినట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ వివరణను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు- ప్రకాశ్ రాజ్, బాబీ సింహాపై తీసుకున్న చర్యలకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను జనవరి 9కి వాయిదా వేసింది.
కొడైకెనాల్లోని విలాపట్టి పంచాయతీలో అనుమతి లేకుండా భవనాల నిర్మాణాలు చేపట్టారని బాబీ సింహా, ప్రకాశ్ రాజ్‌లపై హైకోర్టులో కేసు నమోదైంది. దిండిగుల్ జిల్లాకు చెందిన మహ్మద్ జునైద్ అనే వ్యక్తి ఈ మేరకు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నిర్మాణాల్లో భాగంగా కొండల నుంచి రాళ్లు తొలగిస్తున్నారని, ఇందుకోసం భారీ యంత్ర సామగ్రిని ఉపయోగిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఇది ఇప్పటికే ఉన్న నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని ఆరోపించారు. ఈ నిర్మాణాల వల్ల సమీపంలోని నివాసాలకు ముప్పు ఏర్పడిందని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుల నిరసన
నటుల నిర్మాణాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ రైతులు నిరసన చేసిన తర్వాత ఈ విషయంపై అధికారులు దృష్టిసారించారు. విల్‌పట్టి పంచాయతీ పరిధిలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి మూడంతస్తుల భవనాన్ని నటుడు బాబీ సింహా నిర్మించారని సామాజిక కార్యకర్త, రైతు మహేంద్రన్ ఆరోపించారు. కొండ గ్రామాల రైతులు రాకపోకలకు ఉపయోగించే రోడ్డుపై బాబీ సింహా ఆ భవనాన్ని నిర్మించారని ఆరోపణలు చేశారు. నటుడు ప్రకాశ్ రాజ్ కూడా సరైన అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చేపట్టారని ఆయన ఆరోపించారు. ఆరోపణలపై సమగ్ర సర్వే చేపడతామని రెవెన్యూ అధికారులు హామీ ఇచ్చారు.
చిక్కుల్లో నటుడు ప్రకాశ్ రాజ్.. అక్రమ నిర్మాణాలపై రైతుల ఆగ్రహం.. భవనాల కూల్చివేతకు డిమాండ్
ప్రకాశ్ రాజ్‌కు ఈడీ సమన్లు- రూ.100 కోట్ల స్కామ్ కేసులో విచారణ!