కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. చట్టాల పేరిట అధికారాలను లాక్కుంటూ.. దేశాన్ని అధ్యక్ష తరహా పాలన వైపు తీసుకెళ్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బంగాల్లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడిషయల్ సైన్సెస్లో జరిగిన స్నాతకోత్సవంలో ఆమె మాట్లాడారు. న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుని దేశంలో సమాఖ్య వ్యవస్థ బలంగా ఉండేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ హాజరయ్యారు.
'దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అధికారాన్నంతా ఓ వర్గమే తన చేతుల్లో ఉంచుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో.. ప్రజలను అన్యాయం నుంచి రక్షించాలి. వారి అభ్యర్థనలను వినాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి' అని మమత వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే.. ఎన్‌యూజేఎస్‌ను ప్రపంచంలోని ముఖ్యమైన సంస్థల్లో ఒకటిగా ప్రశంసించారు. రెండు నెలల్లో న్యాయవ్యవస్థ అంటే ఏంటో చూపించారంటూ.. సీజేఐ జస్టిస్ యూయూ లలిత్‌ను ఈ సందర్భంగా అభినందించారు.
ఇవీ చదవండి: 'జర్నలిస్టులకు నగదు పంపలేదు.. ఇదంతా కాంగ్రెస్ టూల్కిట్ ప్రచారమే'
ప్రత్యక్ష రాజకీయాల్లోకి కంగనా రనౌత్.. ఆ పార్టీ అవకాశం ఇస్తే పోటీ!