దేశ రాజధానిలో కరోనా ఉద్ధృతితో పరిస్థితి క్షణక్షణానికి తీవ్రరూపు దాలుస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. దిల్లీ అంతటా కలిపి వంద ఐసీయూ పడకలు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. 24గంటల వ్యవధిలో కరోనా పాజిటివ్ రేటు 24 శాతం నుంచి ఏకంగా 30 శాతానికి చేరుకుందని ఆయన వెల్లడించారు.
దిల్లీలో కరోనా పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆదివారం ఉదయం ఫోన్‌లో మాట్లాడినట్లు వెల్లడించారు. వచ్చే రెండు-మూడు రోజుల్లో పాఠశాలలు, క్రీడా ప్రాంగణాలను ఆసుపత్రులుగా మార్చి 6వేల పడకలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.
"దిల్లీలో తీవ్రంగా ఆందోళన చెందాల్సిన విషయం ఏంటంటే.. కరోనా పాజిటివ్ రేటు 24 గంటల వ్యవధిలో 24శాతం నుంచి 30శాతానికి పెరిగింది. కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. దిల్లీ వ్యాప్తంగా కరోనా రోగుల కోసం నిలిపి ఉంచిన పడకలు చాలా వేగంగా నిండిపోతున్నాయి. ముఖ్యంగా ఐసీయూ పడకలు చాలా తక్కువ సంఖ్యకు చేరుకున్నాయి. దిల్లీ అంతటా కలిపి వంద ఐసీయూ పడకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆక్సిజన్‌కు కొరత కూడా చాలా ఉంది. దిల్లీలో కరోనా పరిస్థితిపై మేం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. కేంద్రం నుంచి సహకారం కోరుతున్నాం. ఇప్పటి అందించిన మద్దతుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు."
-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి
మరోవైపు, దిల్లీలో కరోనా పరిస్థితిని వివరిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు కేజ్రీవాల్. ఆక్సిజన్ సరఫరాను అత్యవసరంగా పెంచాలని విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల్లోని 10వేల పడకల్లో కనీసం 7వేల పడకలు కరోనా రోగుల కోసం కేటాయించాలని కోరారు.
ఇదీ చదవండి: ఒక్కరోజే 2 లక్షల 61 వేల కేసులు- 1500 మరణాలు