దేశంలో ఓట్ల పండగ ప్రారంభమైంది. 4 రాష్ట్రాలు- ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఓటింగ్ జరుగుతోంది. కొవిడ్ నిబంధనలు- కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.
కేరళ(140), తమిళనాడు(234), పుదుచ్చేరి(30), బంగాల్(మూడోదశ-31), అసోం(40)కు సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది.
పోలింగ్ కేంద్రాలు ఫుల్..
అసోంలోని అనేక పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఉదయం నుంచే బారులు తీరారు. క్యూలో నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
అసోంలో ఇప్పటికే రెండు విడతల్లో ఓటింగ్ జరగ్గా.. 75శాతానికిపైగా పోలింగ్ నమోదైంది.
ప్రముఖుల ఓట్లు..
ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుతున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్.. తమిళనాడులోని పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేశారు.
కేరళ పాలక్కడ్ భాజపా అభ్యర్థి, మెట్రోమ్యాన్ శ్రీధరన్.. పొన్నానిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మోదీ ట్వీట్..
ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ప్రజలు, ముఖ్యంగా యువ ఓటర్లు భారీ సంఖ్యల్లో తరలివెళ్లి రికార్డు స్థాయిలో ఓట్లు వేయాలని అభ్యర్థించారు.
ఇదీ చూడండి:- తమిళ పోరులో ప్రజలు ఎవరి పక్షం?