బంగాల్లో నాలుగో విడత పోలింగ్ జరగుతున్న వేళ కూచ్‌బెహార్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఐఎస్ఎఫ్ బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. సీతల్‌కుచి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు తమ రైఫిళ్లను లాక్కునేందుకు యత్నించగా కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.
"ఈ ప్రాంతంలో గొడవ జరిగింది. బలగాల చేతుల్లో ఉన్న రైఫిళ్లను లాక్కునేందుకు స్థానికులు యత్నించారు. దాంతో ఆత్మ రక్షణ చర్యగా కేంద్ర బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. దీనిపై ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది. "
- సీనియర్ పోలీస్ అధికారి.
ఈ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని ఎన్నికల సంఘం ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.
కేంద్ర బలగాల సిబ్బంది తమ పరిధుల్ని దాటి వ్యవహరిస్తున్నారని టీఎంసీ నేత డోలా సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూచ్‌బెహార్ జిల్లాలో రెండు సార్లు కేంద్ర బలగాలు కాల్పులు జరిపాయని చెప్పారు.
" కేంద్ర బలగాలు రెండుసార్లు కాల్పులు జరిపాయి. మాథబంగా బ్లాక్ 1లో జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. సీతల్‌కుచి బ్లాక్‌లో జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరికి గాయాలయ్యాయి. ప్రజలకు కేంద్ర బలగాల సిబ్బంది అన్యాయం చేస్తున్నాయి. తమ పరిధిని దాటి వ్యవహరిస్తున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేవనెత్తితే.. ఎన్నికల సంఘం ఆమెకు నోటీసులు జారీ చేసింది."
-డోలా సేన్, టీఎంసీ నేత
కూచ్‌బెహార్‌లో జరిగిన కాల్పుల ఘటనపై సెంట్రల్ రిజర్వ్ పోలీస్ దళం(సీఆర్పీఎఫ్) స్పందించింది. తమ సీఆర్పీఎఫ్ సిబ్బంది ఎవరూ ఘర్షణ జరిగిన ప్రాంతాల్లో మోహరించలేదని స్పష్టం చేసింది.
తొలిసారి ఓటరు హత్య- భాజపా, టీఎంసీ ఘర్షణ
అంతకుముందు సీతల్‌కుచిలోని ఓ పోలింగ్ బూత్ ముందే ఓటరును కాల్చి చంపారు దుండగులు. ఈ హత్య భాజపా పనేనని టీఎంసీ ఆరోపించింది. మృతి చెందింది తమ కార్యకర్తేనని.. అధికార పార్టీనే ఈ దారుణానికి ఒడిగట్టిందని భాజపా ఆరోపించింది.
మృతి చెందిన యువకుడు ఆనంద్ బుర్మన్ మృతదేహాన్ని పతంతులి పోలింగ్ బూత్ 85 నుంచి బయటకు తీసుకువచ్చామని పోలీసు అధికారి వెల్లడించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో టీఎంసీ, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు. పోలింగ్ బూత్ బయట కార్యకర్తలు బాంబులు విసురుకున్నారని.. కేంద్ర బలగాలు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ జరిపాయని వెల్లడించారు.
లాకెట్ ఛటర్జీ కారుపై దాడి
హూగ్లీ ప్రాంతంలోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భాజపా నేత లాకెట్ ఛటర్జీ కారుపై దాడి చేశారు స్థానికులు. కారును అడ్డుకునే క్రమంలో పోలీసులు, స్థానికుల మధ్య స్వల్ప ఘర్షణ తలెత్తింది. ఇదే ప్రాంతంలో ఎన్నికల కవరేజీకి వెళ్లిన ఓ మీడియా వాహనాలపైనా దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.