రెమ్‌డెసివిర్ ఔషధ సరఫరాలో భారతీయ జనతా పార్టీ 'జోక్యం' చేసుకుంటోందన్న ఆరోపణ మహారాష్ట్ర, గుజరాత్‌లలో తీవ్ర దుమారం రేపుతోంది. కరోనాపై పోరులో విషమంగా ఉన్న రోగులకు ఈ ఔషధాన్ని ఇస్తారు. దేశీయ అవసరాల దృష్ట్యా రెమ్‌డెసివిర్ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
ఇలాంటి సమయంలో దమన్‌కు చెందిన బ్రూక్ ఫార్మా సంస్థ 60 వేల రెమ్‌డెసివిర్ వయల్స్‌ను నిల్వచేసి, ఎగుమతి చేస్తోందన్న సమాచారంతో ముంబయి పోలీసులు విచారణ చేపట్టారు. సంస్థ అధినేత రాజేశ్ డొకానియాను శనివారం రాత్రి పోలీసులు ప్రశ్నించారు. మహారాష్ట్రలో రెమ్‌డెసివిర్ సరఫరాపై ఈ సంస్థతో భాజపా సంప్రదింపులు జరుపుతోంది. దీంతో అది రాజకీయ రగడకు కారణమైంది.
డొకానియాను ప్రశ్నించడంపై హుటాహుటిన పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్, భాజపా నేతలు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం చౌకబారు రాజకీయం చేస్తోందని ఫడణవీస్ విమర్శించారు.
"కొవిడ్‌పై పోరాటం జరుగుతోంది. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం సిగ్గులేని చర్యలకు పాల్పడుతోంది. బ్రూక్ ఫార్మా అధినేతను అదుపులోకి తీసుకున్నారు. ఆ సంస్థ అదివరకే మహారాష్ట్ర సర్కారు, దమన్ అధికారుల నుంచి అనుమతులు తీసుకుంది. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా మహారాష్ట్రకు వీలైనన్ని ఎక్కువ వయల్స్ అందించాలని సంస్థను కోరారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతోంది."
- ఫడణవీస్, మహారాష్ట్ర మాజీ సీఎం
ప్రభుత్వానికి బదులు పార్టీ..
అయితే, రెమ్‌డెసివిర్‌ను ప్రభుత్వ యంత్రాంగమే సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఔషధం కొరతపై పలు రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు అందుతోన్న వేళ.. 'దానం' చేయడానికి ఒక పార్టీ హోదాలో భాజపా దానిని సేకరించిందన్న ఆరోపణ వివాదాస్పదంగా మారింది.
కొద్ది రోజుల క్రితం.. భాజపా గుజరాత్ విభాగం రెమ్‌డెసివిర్‌ను ఉచితంగా పంచింది. మరో ఘటనలో నాగ్‌పుర్ కోసం సన్‌ఫార్మా నుంచి 10 వేల వయల్స్‌ను సేకరించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.
కరోనా రెండో దశ ఉద్ధృతి తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెమ్‌డెసివిర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. దాని ఎగుమతిదారుల్లో భారత్‌కు చెందిన బ్రూక్ ఫార్మా అతిపెద్ద సంస్థ.
భాజపా తీరుపై అసహనం..
భాజపా జోక్యంపై మహారాష్ట్ర హోంమంత్రి దిలిప్ వాల్సే పాటిల్ మండిపడ్డారు. పోలీసు విధుల్లో భాజపా కలుగజేసుకుంటోందని ఆరోపించారు. ఇలాంటి చర్యలను సహించబోయేది లేదన్న ఆయన.. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని చెప్పారు.
మానవత్వ వ్యతిరేక చర్య..
రెమ్‌డెసివిర్ కోసం ప్రజలు ఎదురుచూస్తుంటే.. బాధ్యత గల హోదాలో ఉన్న వ్యక్తులు 'మానవత్వ వ్యతిరేక' చర్యలకు ఎలా పాల్పడతారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆక్షేపించారు.
ఫడణవీస్‌పై శివసేన ఎంపీ ప్రియాంక ఛతుర్వేదీ కూడా విమర్శలు గుప్పించారు.
"చౌకబారు రాజకీయాల కోసం మహారాష్ట్ర ప్రజలను మోసం చేయడం కాకపోతే ఏమిటిది? రహస్యంగా సేకరించిన ఔషధాన్ని ప్రతిపక్ష నేత నిల్వచేస్తున్నారు. దానిని స్వాధీనం చేసుకున్నప్పుడు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఫడణవీస్ సిగ్గుపడాలి. మీ చీకటి కార్యకలాపాలు మరోసారి బహిర్గతమయ్యాయి."
-ప్రియాంక ఛతుర్వేదీ, శివసేన ఎంపీ
'మోదీ ప్రభుత్వ బెదిరింపులు..'
అంతకుముందు గుజరాత్ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థకు చెందిన ఓ లేఖను మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు. అందులో మహారాష్ట్ర కన్నా గుజరాత్‌కు అధికంగా రెమ్‌డెసివిర్‌ను సరఫరా చేసినట్లు ఉండటాన్ని ప్రస్తావిస్తూ.. కేంద్ర ప్రభుత్వ సవతి తల్లి ప్రేమ మరోసారి రుజువైందని పేర్కొన్నారు.
మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకోవడం కోసం మోదీ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్ ఆరోపించారు. ఇంజెక్షన్లను ఎగుమతి చేస్తే లైసెన్సులను రద్దు చేస్తామని ఎగుమతిదారులను భయపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఇది చాలా అవమానకరమని, దీనిని ఖండిస్తున్నట్లు చెప్పారు.
ఉద్ధవ్‌ఠాక్రే అల్ప రాజకీయాలు..
రెమ్‌డెసివిర్‌పై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రే తీరును విమర్శించారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. "ఈ సంక్షోభ సమయంలో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం సహకారంతో పనిచేయాలి. నిన్ననే సమీక్షలో ప్రధాని మోదీ చెప్పారు. కానీ, ఉద్ధవ్‌ఠాక్రే అల్ప రాజకీయాలకు పాల్పడటం బాధాకరం. సిగ్గుమాలిన రాజకీయాలను ఆపి, ఆయన వెంటనే బాధ్యతలను తీసుకోవాలి. వారికి సరిపడా మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేస్తామని కేంద్ర ఆరోగ్యమంత్రి డా.హర్షవర్ధన్ హామీఇచ్చారు." అని గోయల్ ట్వీట్ చేశారు.
ఇవీ చూడండి: