ఇప్పుడు దేశంలో వృద్ధ నాయకులకు కాంగ్రెస్, భాజపా పార్టీల్లో గడ్డుకాలం దాపురించినట్లుంది. ఇరు పార్టీల్లోనూ యువరక్తాన్ని అందలం ఎక్కించడం, పాతవారిని పక్కన పెట్టడం కనిపిస్తోంది! సీనియర్లను పక్కన పెడుతూ కాంగ్రెస్, భాజపాలు ఎందుకిలా యువ నాయకులను ఎంపిక చేసుకునే ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాయో చూద్దాం!
తాజా కర్ణాటక ఉదంతం!
యడియూరప్ప రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వెలువడటంతో ఆయననే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని వీరశైవ లింగాయత్ మఠాధిపతులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పీఠం నుంచి యడియూరప్పను తప్పిస్తే, రాష్ట్రంలో భాజపా అసెంబ్లీ ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారు కొంచెం పెద్ద గొంతుకతోనే హెచ్చరించారు. కానీ, చివరికి నాయకత్వ మార్పుకే భాజపా కేంద్ర నాయకత్వం మొగ్గు చూపింది. అయితే మొదట్లో సీఎం యడియూరప్ప గద్దె దిగేందుకు అంతసులువుగా ఒప్పుకోలేదు. ఆయన అలా ఒప్పుకునే రకం కాదనేది భాజపా కేంద్ర నాయకత్వానికి కూడా తెలుసు. గతంలో పార్టీని వీడి వేరే పార్టీని పెట్టిన చరిత్ర కూడా ఆయనకుంది. నాలుగు దశాబ్దాల పోరాటం ఆయనది. అలాగే నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినా పూర్తికాలం కొనసాగలేకపోవడం గమనార్హం.
యడియూరప్పను తొలగించడానికి కారణాలు!
యడియూరప్ప కుమారుడు విజయేంద్ర చాలా అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. అతను సూడో ముఖ్యమంత్రిలాగా వ్యవహరిస్తున్నాడనే విమర్శలూ బయలుదేరాయి. పైగా మొదటి నుంచీ భాజపాలో కొంతమంది నాయకులు యడ్డీని వ్యతిరేకించసాగారు. తమను కాదని కొత్తవారికి ఆయన ప్రాముఖ్యమిస్తున్నారనే అసంతృప్తి చెలరేగింది. హైకమాండ్ దీనిపై దృష్టి సారించి, గత ఏడాది నుంచి ఆయనపై ఒత్తిడి పెంచింది. కర్ణాటక నుంచి రాజ్యసభ అభ్యర్థుల గురించి ఆయన చేసిన సిఫార్సులను హైకమాండ్ పట్టించుకోలేదు. అప్పటి నుంచి అధినాయకత్వం ఆయనపట్ల సంతృప్తిగా లేదనే సంకేతాలు వెలువడ్డాయి. ఆయన ఆర్‌ఎస్‌ఎస్ మద్దతును కూడా కోల్పోయారు. పైగా చాలామంది ఎమ్మెల్యేలు ఆయనకు వ్యతిరేకంగా మారారు. అంతేకాదు, వయసు మీద పడటంతో ఆయన పార్టీని నడిపించలేరని అధినాయకత్వం భావించింది. అయినా యడియూరప్ప అంత సులువుగా అధికారాన్ని వదులుకునే వ్యక్తి కారు. కాబట్టే అధిష్ఠానం ఆయనను రకరకాల పద్ధతుల్లో దారిలోకి తెచ్చుకుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఆయనపై సీబీఐ, ఈడీ కేసుల బూచిని కూడా చూపించాల్సి వచ్చిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆఖరికి ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. చివరకు భాజపా శాసన సభా పక్షనేతగా బసవరాజ్ బొమ్మైని ఎన్నుకున్నారు.
పంజాబ్ పీసీపీ పీఠం సిద్దూ కైవసం.. ఎలా?
ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఇతర సీనియర్ నాయకులు సిద్దూ ఎంపికను వ్యతిరేకించినా రాహుల్, ప్రియాంక గాంధీలు పట్టుబట్టి మరీ అతణ్ని పీసీసీ పీఠం మీద కూర్చోబెట్టారు. కేవలం కొంతమంది తప్పిస్తే మెజార్టీ ఎమ్మెల్యేలు, మొత్తం 77 మంది సిద్దూను ఇష్టపడుతున్నారని తేల్చారు. దాంతో అమరీందర్ స్థాయిని కుదించి, సిద్దూను పైకి లేవనెత్తారు. సిద్దూ గతంలో భాజపాలో ఉన్నారు. 2017లోనే కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఇక నుంచి కాంగ్రెస్‌లో పెద్ద తలకాయలు చెప్పిందానికల్లా తలూపడం ఎంత మాత్రం ఉండదని, తమ అంచనాలకు అనుగుణంగానే అభ్యర్థులను నియమిస్తామనే సంకేతాలు అధిష్ఠానం నుంచి బలంగా వెళ్లాయి. పైగా 2022 ఫిబ్రవరి-మార్చిలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను సిద్దూ నేతృత్వంలోనే ఎదుర్కోనున్నారు.
తెలంగాణా పీసీసీ పీఠం రేవంత్‌కు దక్కడం వెనుక..?
తెలంగాణలో ఫైర్‌బ్రాండ్ లీడర్, ఉత్సాహం ఉరకలెత్తే నాయకుడే కావాలని రాహుల్, ప్రియాంక, సోనియాగాంధీలు భావించారు. అలాంటివారే చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించగలరనీ, తద్వారా కేంద్రంలోనూ కాంగ్రెస్‌కు అధికారం దఖలు పడుతుందని విశ్వసిస్తున్నారు. ఎంతోమంది అనుభవజ్ఞులు, తలలు పండిన నాయకులు ఉన్నప్పటికీ 2017లో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన రేవంత్‌రెడ్డికే పీసీసీ పీఠం కట్టబెట్టారు.
ఆ పార్టీలు ఏమనుకుంటున్నాయి?
ఈ పరిణామాలన్నీ చూస్తుంటే భాజపా, కాంగ్రెస్ పార్టీలు యువనాయకులకే ప్రాధాన్యమిస్తున్నాయని అర్థమవుతోంది. పార్టీ శ్రేణులను నడిపించేందుకు ఉత్సాహం అడుగంటిపోయిన వృద్ధ నాయకులకు చేతకాదని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. పైగా రాష్ట్రాల్లో తామెంతో గొప్ప నాయకులమనే భ్రమలో ఉన్నప్పటికీ, అధిష్ఠానం అంచనాలు వేర్వేరుగా ఉంటాయని, తమకు గెలుపు గుర్రాలే కావాలనే సంకేతాలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా, చూసిన మొహాలనే చూస్తున్న ప్రజలు విసుగెత్తి పోతారని, దాంతో ప్రభుత్వ లేదా పార్టీ వ్యతిరేకతను కట్టడి చేసేందుకు కొత్త మొహాలను, అందులోనూ యువనాయకులను తెరమీదకు తీసుకురావడమే సరైనదని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌లో ఎంతోమంది పార్టీ సీనియర్ నాయకులు ఉండగా, పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎవరూ పెద్దగా కష్టపడిందేమీ లేదని రాహుల్, ప్రియాంకగాంధీ బాహాటంగానే తమ అసంతృప్తిని వెలిబుచ్చారు. అప్పటి నుంచి పార్టీ అధ్యక్షపదవిని రాహుల్ చేపట్టకుండా ఉన్న సంగతి విదితమే. అయినప్పటికీ ఇప్పుడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పీఠం దక్కాలంటే తమ తల్లికంటే, తమకు విధేయంగా ఉండాలనే అంశాన్ని రాహుల్-ప్రియాంక ద్వయం స్పష్టం చేస్తున్నారు. ఇంకా ఇలాంటి పరిణామాలే మిగతా రాష్ట్రాల్లోనూ జరగవచ్చు. ఇవన్నీ ఆయా నాయకులు రాష్ట్రంలో ఎంత బలవంతులైనప్పటికీ పార్టీ హైకమాండ్ నిర్ణయాలే శిరోధార్యమనే విషయాన్ని చాటుతున్నాయి. అంతేకాదు, పార్టీ లేదా ప్రభుత్వ పదవిలో కొనసాగాలంటే మెజార్టీ పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా హైకమాండ్ పరిగణనలోకి తీసుకుంటున్నదని తెలుస్తోంది.
ఇదీ చూడండి: తండ్రులే కాదు.. కుమారులు కూడా ముఖ్యమంత్రులే