Telangana Political Leader Harasses Woman Corporator : రాష్ట్రంలో సామాన్య మహిళలకే కాదు ప్రజా సేవలు చేస్తూ మంచి పదవుల్లో విధులు కొనసాగిస్తున్న మహిళలకు కూడా రక్షణ లేకుండా పోతోంది. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా కామాంధులు మాత్రం రోజురోజుకు రెచ్చిపోతూనే ఉన్నారు. ఉన్నత ఉద్యోగాలు.. పదవుల్లో ఉన్న వారు కూడా వారి స్థానాన్ని మరిచి నీచంగా ప్రవర్తిస్తూ దిగజారిపోతున్నారు. అధికార పార్టీ నాయకుడనే అహంకారమో లేక మంచి పదవిలో ఉన్నాను.. నన్ను ఎవరు ఏం చేస్తారు అన్న ధీమానో..? ఓ ప్రజాప్రతినిధి ఏకంగా మహిళా కార్పొరేటర్‌ను వేధించడం మొదలుపెట్టాడు.
Ruling party Leader harass Lady corporator : అతనో అధికార పార్టీ ప్రజాప్రతినిధి. రాష్ట్రంలో పలు హోదాల్లో పనిచేసిన ఆయనకు మంచి రాజకీయ అనుభవం ఉంది. అంతటి గుర్తింపు ఉన్నా వంకరబుద్ధి మాత్రం ఎక్కడికి పోలేదు. ఆయన మాట్లాడినట్టు బయటికొచ్చిన ఆడియో రికార్డులు ప్రస్తుత రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన నియోజకవర్గంలో మహిళా కార్పొరేటర్‌తో సమయం సందర్భం లేకుండా రాత్రివేళ ఫోన్‌చేసి మాట్లాడిన సంభాషణలు పార్టీ అధినాయకత్వం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం మేరకు.. గత కొంతకాలంగా ఆ ప్రజాప్రతినిధి తన నియోజకవర్గంలో మహిళా కార్పొరేటర్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఆమె భర్త కూడా రాజకీయాల్లో చురుగ్గానే ఉంటున్నాడు. తన వ్యక్తిగత సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ఆమెతో చనువుగా ఉండేవాడు. అతడి బుద్ధి తెలియక ఆమె కూడా తన ఇబ్బందులను అతనితో పంచుకునేది. దీన్నే అవకాశంగా తీసుకున్న ఆ ప్రజాప్రతినిధి ఒక అడుగు ముందుకు వేశాడు. సమయం రాగానే తన వంకర బుద్ది బయట పెట్టాడు.
మూడు రోజుల క్రితం రాత్రివేళ ఆమెకు ఫోన్ చేసి వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించాడు. మెల్లిగా తర్వాత తిన్నావా.. లేదా? ఈ రాత్రి వరకు ఏం తినకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుంది అంటూ గోముగా అడిగాడు.. కొంత సమయం తర్వాత అసభ్యకరంగా మాట్లాడాడు దీంతో కంగుతిన్న ఆమె.. ముందు జాగ్రత్తగా తన ఫోన్లో ఆ సంభాషణను రికార్డు చేసింది. ఈ సంభాషణల్ని పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇంకా ఈ రికార్డుల్ని ఒక మంత్రికి కూడా పంపినట్టు తెలుస్తోంది. మంత్రి ఎదుట ఆ సంభాషణ గురించి తన గోడు చెప్పుకుంటూ ఆ మహిళా కార్పొరేటర్ కన్నీరు పెట్టుకున్నారని తెలిసింది. విషయం బయటకు పోనివ్వకుండా చూడాలని, వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అధినాయకత్వం ఆమెకు హామీ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై ఇంటలిజెన్స్ బృందం వివరాలు సేకరిస్తోంది.
ఇవీ చదవండి: