తమిళనాడు కడలూరు సాయుధ దళాల్లో గ్రేడ్ 1 కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రభాకరన్(33).. తన భార్య విష్ణుప్రియ, కూతురుతో పెరుంబాక్కంలోని కల్లకురిచి పోలీసు రెసిడెన్షియల్ క్వార్టర్స్‌లో నివాసముంటున్నాడు. మంగళవారం ఉదయం.. కూతురితో కలిసి విష్ణుప్రియ మేల్పట్టంబాకంలో ఓ ఫంక్షన్‌కు వెళ్లింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ప్రభాకరన్ మృతదేహం కనిపించింది. తల్లీబిడ్డలు ప్రభాకరన్‌ను చూసి విలపించారు.
ఈ ఘటనపై కడలూరు న్యూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పంచనామా కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో పోలీసులకు కొన్ని కీలక విషయాలు తెలిశాయి.
అనారోగ్యం కారణంగా గతకొన్ని నెలలుగా ప్రభాకరన్ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నాడు. అయినా జబ్బు తగ్గకపోవడం వల్ల మనస్తాపానికి గురయ్యాడు. తనకు దెయ్యం పట్టిందని, అందుకే జబ్బు తగ్గడం లేదని భావించాడు. ఈ క్రమంలోనే ప్రభాకరన్ ఓ మంత్రగత్తెను కలిశాడు. ఆమె చెప్పిన దాని ప్రకారం 15రోజులు సెలవు తీసుకుని ఇంటికే పరిమితమయ్యాడు. ఇంట్లో పూజలు చేస్తూ ఉండిపోయాడు.
ఈ సమయంలోనే ప్రభాకరన్ మానసికస్థితి మరింత విషమించింది. పోలీస్ స్టేషన్లో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్టు, ఆమె దెయ్యంగా మారి తనని చంపడానికి వస్తున్నట్టు ప్రభాకరన్ భయపడేవాడు. ఈ క్రమంలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:- గిరిజన బాలిక అపహరణ.. ఆపై అత్యాచారం