Remand Report in Madhapur Drug Case : మాదాపూర్ మాదక ద్రవ్యాల వ్యవహారంలో (Madhapur Drug Case) .. నిందితుల రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పలు విషయాలు వెల్లడించారు. సినీ ఫైనాన్సర్ వెంకట రత్నకర్‌రెడ్డి, బాలాజీ, మురళిలను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వారికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. వారి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని కూడా.. మొత్తం 24 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో మత్తు పదార్థాలు విక్రయించిన వారు నలుగురు కాగా.. మిగతా వ్యక్తులు స్వీకరించిన వారున్నారు.
పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేయగా.. వైజాగ్ రామ్‌తో పాటు థామస్ అనఘ కలు, అమ్మెడిచుకుపుడి, మూమాగో, ఇగ్బావ్రే మాకిల్ పరారీలో ఉన్నట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వివరించారు. రామ్‌చంద్, కలహర్‌రెడ్డి, సుశాంత్‌రెడ్డి, ఉప్పలపాటి రవి, శ్వేత, కార్తీక్, సూర్య, ఇంద్రతేజ, హిటాచి, నర్సింగ్, అజీమ్, అహ్మద్ తదితర మొత్తం 18 మంది.. వెంకట్ బృందం వద్ద మాదకద్రవ్యాలు సేవించినట్టు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు వెంకట్‌కు గతంలో కూడా నేర చరిత్ర ఉన్నట్టు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో వివరించారు.
బెంగళూరు నుంచి తరచూ మాదకద్రవ్యాలను వైజాగ్ రామ్, ముగ్గురు నైజీరియన్లు తీసుకువచ్చి.. వెంకట్ బృందానికి సరఫరా చేసేవారని పోలీసులు పేర్కొన్నారు. రెండు రోజులకోసారి వెంకట రత్నాకర్‌రెడ్డి (Film Financier Venkata Ratnakar Reddy) డ్రగ్స్ పార్టీలు నిర్వహించేవాడని తెలిపారు. అయితే వెంకట్ బృందంతో సినీ పరిశ్రమకు చెందిన వారికి ఎవరెవరికి పరిచయాలు ఉన్నాయి అనే అంశం పై ప్రస్తుతం పోలీసులు దృష్టి పెట్టారు. నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించనున్నారు. విచారణలో మరిన్ని అంశాలు బయటపడే అవకాశం ఉంది.
శివరాత్రి పూట రేవ్‌పార్టీ... పోలీసుల అదుపులో 90 మంది..
Madhapur Rave Party Case Update : ఈ కేసులో పట్టుబడిన వెంకట రత్నాకర్‌రెడ్డి (Film Financier Venkat) పాత్రపై విచారణ జరుపుతున్న పోలీసులకు కీలక విషయాలు తెలుస్తున్నాయి. గతంలో నిందితుడు తాను ఐఆర్‌ఎస్ అధికారినంటూ మోసాలు చేసినట్టు విచారణలో తేలింది. ఇద్దరు సినీ నిర్మాతల నుంచి.. వెంకట రత్నాకర్‌రెడ్డి రూ.30 లక్షలకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక అధికారిని కూడా పెళ్లి పేరుతో మోసం చేసినట్టు బయటకువచ్చింది. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న వెంకట్ లీలలు చూసి పోలీసులు కంగుతింటున్నారు. సినిమాలో అవకాశాల పేరుతో యువతులకు నిందితుడు వల వేస్తున్నట్టు విచారణలో తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్టు నిర్ధారించారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్టు మాదకద్రవ్యాల నిరోధక విభాగం పోలీసులు విచారణలో గుర్తించారు.
అసలేం జరిగిదంటే : హైదరాబాద్‌లో పోలీసులు పక్కా సమాచారంతో గురువారం.. డ్రగ్స్ గుట్టును రట్టు చేశారు. గుడి మల్కాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నిందితుడు బాలాజీని పట్టుకున్నారు. గుడి మల్కాపూర్ పోలీసులతో కలిసి సోదాలు చేసిన తెలంగాణా యాంటీ నార్కొటిక్స్ బ్యూరో పోలీసులు.. అతడిని అరెస్ట్ చేసి 15 ఎక్స్‌ట్రాపిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అతనిచ్చిన సమాచారంతో మాదాపూర్‌లోని (Rave Party in Madhapur) విఠల్‌రావునగర్‌లోని ఫ్రెష్‌లివింగ్ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నంబర్ 804లో సోదాలు చేసిన పోలీసులు.. వెంకటరత్నారెడ్డి సహా గుంటూరుకు చెందిన మురళిని అరెస్ట్ చేశారు.
సోదాల సమయంలో వీరితో పాటు ఇద్దరు యువతులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి వెంకటరత్నారెడ్డి వారిని తీసుకొచ్చినట్లు తెలిపారు. బాలాజీ, వెంకటరత్నారెడ్డి, మురళిలను అరెస్ట్ చేసిన టీన్యాబ్ పోలీసులు.. 2.8 గ్రాముల కొకైన్, 6 ఎల్‌ఎస్డీ బోల్ట్స్, 25 ఎక్స్‌ట్రాపిల్స్, 40 గ్రాముల గంజాయి, రూ.72,500 నగదు, 2 కార్లు, 5 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం సొత్తు విలువ రూ.32.89 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.