Bandi Sanjay A1 Accused In 10th Paper Leakage: రాష్ట్రంలో మొన్నటి వరకు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు, ఆతర్వాత పదో తరగతి పేపర్ లీకేజీ కేసు.. ఇప్పుడు బండి సంజయ్ అరెస్ట్‌తో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయంగా బండి అరెస్ట్ రాజకీయ దుమారాన్నే సృష్టించింది. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ కుమార్‌ను నిందితునిగా భావిస్తూ.. పోలీసులు నిన్న అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. అయితే తాజాగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో బండి సంజయ్‌ను ఏ-1గా చేర్చారు.
అలాగే పేపర్ లీకేజీ కేసులో సూత్రధారిగా ఉన్న ప్రశాంత్‌ను పోలీసులు ఏ-2గా చేర్చి.. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు ఆ రిపోర్టులో తెలిపారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ఏ-1 బండి సంజయ్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసును నమోదు చేశారు. 120బి, 420, 447, 505 సెక్షన్ల కింద సంజయ్‌పై కేసులు నమోదు చేసి.. హనుమకొండ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
రిమాండ్ రిపోర్టులో బండి సంజయ్ ఏ1: 8 పేజీల రిమాండ్ రిపోర్టును కమలాపూర్ పోలీసులు తయారు చేశారు. పదో తరగతి విద్యార్థుల్లో గందరగోళం సృష్టించి.. వారిలో లేనిపోని భయాలను కల్పించేందుకే కుట్ర చేశారని కేసు నమోదు చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అనుచరులే పేపర్ లీకేజీ చేశారని.. రిపోర్టులో పేర్కొన్నారు. సంజయ్ ప్రోత్సాహంతోనే పేపర్ లీకేజీ జరిగినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు న్యాయవాది తెలిపారు. అందుకే బండి సంజయ్‌ను ఏ-1గా చేర్చినట్లు చెప్పారు.
రిమాండ్ రిపోర్టులో ఉన్న నిందితులు: పదో తరగతి ప్రశ్నపత్రాల కేసులో ఏ-1గా బండి సంజయ్, ఏ-2గా జర్నలిస్టు ప్రశాంత్, ఏ-3గా ల్యాబ్ అసిస్టెంట్ మహేశ్, ఏ-5 ఎం. శివ గణేశ్, ఏ-6 పోగు సుభాష్, ఏ-7 పోగు శశాంక్, ఏ-8 దూలం శ్రీకాంత్, ఏ-9 పెరుమాండ్ల శ్రామిక్, ఏ-10 పోతనబోయిన వర్షిత్లను చేర్చారు. ఏ-4 నిందితుడు మైనర్ కావడం వల్ల అతని పేరును బయటకు ప్రస్తావించడం లేదు.
బండి సంజయ్ అరెస్టు ఎలా జరిగింది: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ అరెస్ట్ హాట్ టాఫిక్‌గా మారింది. మంగళవారం కమలాపూర్‌లోని హిందీ ప్రశ్నాపత్రం బయటకి వచ్చిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత.. ఆ వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట కరీంనగర్‌లోని బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు తరలించి.. అక్కడి నుంచి నేరుగా పాలకుర్తిలో వైద్య పరీక్షల నిమిత్తం తీసుకొని వెళ్లి పరీక్షలు జరిపించారు. అంతకుముందు బొమ్మలరామారం ఠాణా వద్ద బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఆ తర్వాత ఆసుపత్రి వద్ద అదే పరిస్థితి నెలకొంది. ఫైనల్‌గా బండి సంజయ్‌ను హనుమకొండలోని కోర్టులో హాజరుపర్చారు.
ఇవీ చదవండి: