Polavaram Project Latest Updates: ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాధారమైన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలను వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందనే అంశంపై.. తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌టుడు.. లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో.. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందనే అంశంపై.. ఒక నిర్దిష్టమైన గడువును చెప్పలేదు.
గత ప్రతిపాదనలు ఆమోదించాల్సి ఉంది.. తొలిదశలో 41.15 మీటర్ల నీటి నిల్వతో చేపట్టినట్లు ఏపీ సర్కార్ చెప్పిందన్న మంత్రి.. ఇందుకు రూ.17వేల 144 కోట్లు ఖర్చవుతుందని ప్రతిపాదించినట్టు వివరించారు. ఈ నిధుల విడుదలకు కేంద్రం ఆమోదించినట్టు తెలిపారు. మిగిలిన పనులకు అదనంగా రూ.12వేల 911 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపినట్టు.. కేంద్రమంత్రి వివరించారు. అయితే, పోలవరం నిధులపై.. గత నిర్ణయాన్ని సవరిస్తూ మంత్రివర్గం తాజా ప్రతిపాదనలు పెట్టిందన్న మంత్రి.. వాటిని ఆమోదించాల్సి ఉందని వివరించారు.
పోలవరం ఎప్పటికీ పూర్తి అవుతుంది ?.. ఈ క్రమంలో పోలవరం నిర్మాణ విషయంలో తొలుత.. 2024 జూన్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించామన్న కేంద్ర మంత్రి.. 2020, 2022లో వచ్చిన వరదల కారణంగా ఆలస్యమైందని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో.. మంత్రి తన సమాధానంలో పేర్కొనలేదు. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టుకు నిధులపై వైఎస్సార్సీపీ సభ్యుడు అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి.. తొలిదశలో 41.15 మీటర్ల నిర్మాణం పూర్తికి ఏపీ సర్కార్ నిధులు కోరినట్టు తెలిపారు.
పోలవరంపై లోపించిన స్పష్టత.. దేశ రాజధాని దిల్లీలో ఉన్న పార్లమెంట్ భవనంలో గతకొన్ని రోజులుగా శీతకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నేటి రాజ్యసభ సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ పలు ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలకు కేంద్ర సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌టుడు.. లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అయితే, కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానాల్లో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఫలానా సంవత్సరంలో పూర్తవుతుందనే స్పష్టత ఇవ్వకపోవటం చర్చనీయాంశంగా మారింది.
వరదల వల్ల నిర్మాణం ఆలస్యమైంది.. పోలవరం నిర్మాణంపై కేంద్ర సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు ఇచ్చిన సమాధానాల ప్రకారం..''పోలవరం తొలిదశ కోసం ఏపీ ప్రభుత్వం నిధులు కోరింది. తొలిదశలో 41.15 మీటర్ల నిర్మాణం పూర్తికి ఏపీ నిధులు కోరింది. తొలిదశకు రూ.17,144 కోట్లు ఖర్చవుతుందని కేంద్రానికి ఏపీ చెప్పింది. 2024 జూన్ నాటికి నిర్మించాలని తొలుత కేంద్రం నిర్ణయించింది. కానీ, 2020, 2022ల్లో వచ్చిన వరదల వల్ల పోలవరం నిర్మాణం ఆలస్యమైంది.'' అని ఆయన సమాధానాలు ఇచ్చారు. ఆ సమాధానాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో కచ్చితమైన సమాధానం మాత్రం పేర్కొనలేదు.