PM security breach: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై సుప్రీంకోర్టు విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బృందానికి జస్టిస్ ఇందూ మల్హోత్రా నేతృత్వం వహించనున్నారు. ఈమేరకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 5న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌కు ప్రధాని వెళ్తుండగా.. అడ్డగించిన ఘటనపై ఈ కమిటీ విచారణ జరపనుంది.
పంజాబ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ ఏకపక్షంగా జరగకూడదన్న ఆరోపణల నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో జస్టిస్ ఇందూ మల్హోత్రాతోపాటు పంజాబ్-హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, చండీగఢ్ డీజీపీ, ఎన్ఐఏ ఐజీ, పంజాబ్ సెక్యూరిటీ ఏడీజీ సభ్యులుగా ఉంటారని ధర్మాసనం వెల్లడించింది.
modi punjab visit
ఏమైందంటే?
ప్రధాని మోదీ జనవరి 5న పంజాబ్ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫిరోజ్పుర్లో జరగాల్సిన సభ ఆకస్మికంగా రద్దు అయింది. పంజాబ్‌లో మోదీ అడుగుపెట్టినప్పటికీ.. సభకు హాజరు కాకుండానే తిరిగి ఆయన దిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. "కొన్ని కారణాల వల్ల సభకు మోదీ హాజరు కావడం లేదు" అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ.. సభా వేదికపై ప్రకటించారు. అయితే.. సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే సభకు మోదీ హాజరు కాలేకపోయారని కేంద్ర హోం శాఖ తెలిపింది. భద్రతా లోపాల్ని తాము తీవ్రంగా పరిగణిస్తామని, దీనిపై పూర్తి స్థాయి నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం ఈ విషయంపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది.
ఇదీ చదవండి: షాకింగ్.. కేంద్ర సమాచార శాఖ ట్విట్టర్ ఖాతా హ్యాక్