గుప్కార్ నేతలో నిర్వహించిన సమావేశం.. అభివృద్ధి ప్రగతిశీల జమ్ముకశ్మీర్ నిర్మాణం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో కీలకమైన ముందడుగు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లో సరిహద్దులను నిర్ణయించే ప్రక్రియ త్వరగా పూర్తై.. ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. గురువారం దిల్లీలో గుప్కార్ కూటమి నేతలతో భేటీ(PM Modi meets JK leaders) అనంతరం ఆయన ఈమేరకు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
"జమ్ముకశ్మీర్ నేతలో నేటి సమావేశం అభివృద్ధి, ప్రగతి శీల జమ్ముకశ్మీర్ నిర్మాణం కోసం చేస్తున్న ప్రయత్నాలలో కీలకమైన ముందడుగు. జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటమే మా ప్రాధాన్యం. సరిహద్దుల నిర్ణయించే ప్రక్రియ త్వరగా పూర్తి కావాలి. దాంతో అక్కడి ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. తద్వారా జమ్మకశ్మీర్ అభివృద్ధి చెందుతుంది. "
-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
అంతకుముందు సమావేశంలో భాగంగా.. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ జాతి ప్రయోజనాల కోసం, జమ్ముకశ్మీర్ అభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు మోదీ. 'దిల్లీకి దూరీ, దిల్కి దూరీ' నినాదం చేస్తూ కశ్మీర్- దిల్లీ దూరానికి, హృదయాల మధ్య దూరానికి ముగింపు పలకాలి అనుకుంటున్నట్టు వెల్లడించారు.
ఆ రెండూ కీలకం..
నియోజకవర్గాలు నిర్ణయించే ప్రక్రియ పూర్తవటం, శాంతి పూర్వకంగా ఎన్నికలు జరగటం.. జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా పునురుద్ధరించే ప్రక్రియలో కీలకమైన అంశాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
"జమ్ముకశ్మీర్ సర్వతోముఖాభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. జమ్ముకశ్మీర్ భవిష్యత్తు గురించి మేం చర్చించాం. పార్లమెంటులో వాగ్దానం చేసినట్లు జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి కల్పించటంలో నియోజకవర్గాలను నిర్ణయించే ప్రక్రియ పూర్తవటం, ప్రశాంతంగా ఎన్నికలు జరగటం కీలకమైన మైలురాళ్లు."
-అమిత్ షా, కేంద్ర హోం మంత్రి.
2019 ఆగస్టు 5న జమ్మకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. దీంతో జమ్ముకశ్మీర్‌లో రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది. ఆర్టికల్ 370(Article 370) రద్దు తర్వాత అక్కడి నేతలతో ప్రధాని సమావేశం కావడం ఇదే తొలిసారి. దాదాపు మూడున్నర గంటలపాటు ఆయన ఈ సమావేశం నిర్వహించారు.
పునరుద్ధరించాల్సిందే..
రాజ్యాంగ విరుద్ధంగా కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ చర్యను జమ్ముకశ్మీర్ ప్రజలు అంగీకరించరని ఈ సమావేశంలో మోదీకి తాను చెప్పానని పీడీపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ తెలిపారు. నెలలు లేదా సంవత్సరాలు సమయం పట్టినా.. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో వాణిజ్య విషయంలో కూడా ఆ దేశంతో మాట్లాడాలని కోరారు.
మోదీ ఏం మాట్లాడలేదు..
జమ్ముకశ్మీర్‌కు జరిగిన అన్యాయంపై తాము న్యాయవ్యవస్థ ద్వారా పోరాడుతామని ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు. రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఏర్పడిన దూరాన్ని తగ్గించే బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. ఎన్నికలు, రాష్ట్రా హోదాను పనురుద్ధరిస్తామని ప్రధాని మోదీ, అమిత్ షా చెప్పారని పేర్కొన్నారు. అయితే.. రాష్ట్ర హోదాను పునురుద్ధరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ఆజాద్ చేసిన డిమాండ్‌పై మోదీ ఏమీ మాట్లాడలేదని తెలిపారు.
సమావేశంలో పాల్గొన్న గులాబ్ నబీ ఆజాద్, ఫరూక్ అబ్దుల్లాతో పాటు ఇతర జమ్ముకశ్మీర్ నేతలు తమ అభిప్రాయాలను మోదీతో పంచుకున్నారు.