Narendra Modi Security Breach : ప్రధానమంత్రి అధికారిక నివాసంపై డ్రోన్ కలకలం రేపింది. నో ఫ్లైయింగ్ జోన్లో డ్రోన్ ఎగిరినట్లు తమకు సమాచారం అందిందని దిల్లీ పోలీసులు వెల్లడించారు. ఉదయం 5.30 గంటలకు ప్రధానికి భద్రత కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) డ్రోన్ గురించి తమకు సమాచారం ఇచ్చిందని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అయితే, అనుమానాస్పద వస్తువులేవీ తమకు లభ్యం కాలేదని పోలీసులు వెల్లడించారు.
'ఏమీ గుర్తించలేదు'
"తెల్లవారుజామున మాకు ఓ పీసీఆర్ కాల్ వచ్చింది. డ్రోన్ లాంటి వస్తువు ప్రధానమంత్రి నివాసంపై ఎగరడం కనిపించిందని చెప్పారు. కానీ భద్రతా ఏజెన్సీలకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) కూడా ఏమీ గుర్తించలేదు" అని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై దిల్లీ పోలీసు శాఖ ప్రకటన జారీ చేసింది. గుర్తు తెలియని ఎగిరే వస్తువుకు సంబంధించిన సమాచారం ఎన్డీడీ కంట్రోల్ రూమ్‌కు అందిందని తెలిపింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టామని పేర్కొంది. అలాంటి వస్తువేదీ తాము గుర్తించలేదని స్పష్టం చేసింది. 'ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాం. ప్రధాని నివాసానికి సమీపంలో ఎలాంటి ఎగిరే వస్తువు కనిపించలేదని వారు కూడా చెప్పారు' అని దిల్లీ పోలీసు శాఖ తన ప్రకటనలో వివరించింది. ఇది సున్నితమైన ప్రాంతం కాబట్టి ప్రస్తుతం దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అధికారులు తెలిపారు. వాస్తవాలను ధృవీకరించిన తర్వాత మాత్రమే అసలు విషయాలు తెలుస్తాయని వారు వెల్లడించారు.
పైవంతెనపై చిక్కుకున్న ప్రధాని వాహనశ్రేణి..
Modi Security Breach Punjab : 2022 జనవరిలోనూ ప్రధాని మోదీ భద్రతలో లోపాలు వెలుగుచూశాయి. పంజాబ్ పర్యటనకు వెళుతున్న ప్రధాని నరేంద్ర మోదీకి అనూహ్య పరిణామం ఎదురైంది. ఫిరోజ్‌పుర్ జిల్లాలో నిరసనకారులు రహదారిని దిగ్బంధించడం వల్ల.. ప్రధాని, ఆయన వాహనశ్రేణి 15-20 నిమిషాల పాటు పైవంతెనపై చిక్కుకుపోయింది. దీంతో ప్రధాని తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని దిల్లీకి తిరుగు పయనమయ్యారు. సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే సభకు మోదీ హాజరు కాలేకపోయారని అప్పట్లో అధికారులు తెలిపారు.
భద్రతా వలయాన్ని ఛేదించుకుని మోదీ వద్దకు..
PM Security Breach in Karnataka : కొద్ది రోజుల క్రితం ప్రధాని కర్ణాటక పర్యటనలోనూ భద్రత వైఫల్యం జరిగింది. హుబ్బళ్లిలో రోడ్‌షో సందర్భంగా ఓ యువకుడు భద్రతా వలయాన్ని ఛేదించుకుని.. ఒక్కసారిగా ప్రధాని మోదీకి అత్యంత సమీపానికి దూసుకురావడం కలకలం రేపింది. జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించేందుకు హుబ్బళ్లికి చేరుకున్న ప్రధాని.. స్థానిక విమానాశ్రయం నుంచి వేడుక జరిగే రైల్వే స్పోర్ట్స్ గ్రౌండ్ వరకు రోడ్‌షో నిర్వహించారు. ఈ క్రమంలోనే.. ఓ వ్యక్తి బారికేడ్ దాటి ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చాడు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.