దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడికి ప్రజారోగ్య వ్యవస్థ స్పందిస్తున్న తీరుపై ఆరా తీశారు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాలు, జిల్లాల పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రాలకు అన్ని విధాలా సాయం చేస్తామని మోదీ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ కొనసాగుతున్న తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్న ప్రధాని.. కొవిడ్ ఔషధాల లభ్యతపైనా చర్చించారు.
31 శాతం మందికి తొలి డోసు..
రాష్ట్రాలకు ఇప్పటివరకు 17.7 కోట్ల టీకాలు సరఫరా చేసినట్లు ప్రధానికి సమాచారం అందించారు అధికారులు. 45 ఏళ్లు పైబడిన అర్హత కలిగిన జనాభాలో.. 31 శాతం మందికి వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చారని వివరించారు.
''టీకా ప్రక్రియలో వేగం తగ్గకుండా రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ ఉన్నప్పటికీ పౌరులు టీకా పొందేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలి. టీకా ప్రక్రియలో పాల్గొనే ఆరోగ్య కార్యకర్తలను ఇతర విధుల కోసం మళ్లించకూడదు.''
- సమీక్షలో ప్రధాని
రాబోయే కొద్ది నెలల్లో టీకా ఉత్పత్తిని పెంచడానికి రోడ్‌మ్యాప్‌పై ప్రగతిని ప్రధాని సమీక్షించారు.
కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, హర్షవర్ధన్, పీయూష్ గోయల్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు.
ఇదీ చూడండి: బంగాల్లో కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై దాడి