అహ్మదాబాద్‌లో నిర్మించిన సర్దార్ ధామ్ భవన్‌ను(Sardar Dham Bhavan) వర్చువల్‌గా ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా 9/11 ఉగ్రదాడిని(9/11 Attack Year) ప్రపంచ చరిత్రలోనే అత్యంత హేయమైన ఘటనగా అభివర్ణించారు.
'భారతీయులుగా మనం ఏదైనా ఒక కొత్త పనిని ప్రారంభించే ముందు గణేషుడిని పూజిస్తాం. అయితే వినాయక చవితిని(Vinayaka Chavithi) పురస్కరించుకుని 'సర్దార్ ధామ్ భవన్' ప్రారంభోత్సవం జరుగుతుండటం శుభపరిణామం' అని ప్రధాని మోదీ తెలిపారు.
"చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజున సర్దార్ ధామ్ భవన్ ప్రారంభం కావడం మన అదృష్టం. 9/11 ప్రపంచ చరిత్రలో మానవత్వంపై జరిగిన దాడిగా గుర్తుండిపోయే తేదీ. అయితే ఇది మానవతా విలువల గురించి మానవాళికి నేర్పిన రోజు."
-ప్రధాని మోదీ
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నేడు ప్రారంభమైన 'సర్దార్ ధామ్ భవన్' విద్య, సామాజిక పరివర్తన, బలహీన వర్గాల అభ్యున్నతి, యువతకు ఉపాధి అవకాశాలను అందించేందుకు కృషి చేస్తుందని ప్రధాని చెప్పారు.
సెప్టెంబర్ 11కు మరో విశేషం ఉందన్నారు ప్రధాని మోదీ. 1893లో చికాగో జరిగిన సమావేశంలో స్వామి వివేకానంద(Swami Vivekananda) చేసిన ప్రసంగాన్ని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. నేటి యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
"మరో అంశం పరంగానూ సెప్టెంబర్ 11 ముఖ్యమైనదే. ఎందుకంటే 1893లో ఇదేరోజు చికాగోలో స్వామి వివేకానంద చారిత్రక ప్రసంగం చేశారు. భారత మానవతా విలువల గురించి ప్రపంచానికి చాటిచెప్పారు."
-ప్రధాని మోదీ
రైతులకు మోదీ శుభాకాంక్షలు..
నువాఖాయి పర్వదినాన్ని(Nuakhai Juhar) పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. జాతి నిర్మాణంలో రైతుల పాత్ర వెలకట్టలేనిదని ప్రధాని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. వ్యవసాయ పనుల్లో భాగంగా.. నువాఖాయి జుహార్ పండుగను ముఖ్యంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో జరుపుకుంటారు.
మహాకవి సేవలు మరువలేనివి..
ఇక బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని(Banaras Hindu University) ఆర్ట్స్ ఫ్యాకల్టీ విభాగంలో తమిళ మహాకవి 'సుబ్రహ్మణ్య భారతి'(Subramanya Bharathi) పేరిట ఏర్పాటైన అధ్యయన కేంద్రాన్ని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తమిళ సాహిత్యానికి సుబ్రహ్మణ్య భారతి చేసిన సేవలు మరువలేనివని అని శ్లాఘించారు.
అహ్మదాబాద్‌లో నిర్మించిన ఈ భవనంలో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. 2వేల మంది బాలికలకు హాస్టల్ సదుపాయం ఈ భవనంలో ఉంటుంది. ఈ కార్యక్రమానికి గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ హాజరయ్యారు.