అఫ్గాన్‌లోని తాజా పరిణామాలు.. భారత్‌తో సహా పొరుగు దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఆసియా ప్రాంతంలో అనిశ్చితి పెరుతుందని.. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, వేర్పాటువాద సిద్ధాంతాలు ఊపందుకుంటాయని హెచ్చరించారు. అఫ్గాన్ సంక్షోభంపై ఏర్పాటు చేసిన ఎస్సీఓ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న మోదీ.. ఈ వ్యవహారంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు.
"భారత్ సహా పొరుగు దేశాలపై అఫ్గాన్ పరిణామాల ప్రభావం పడుతుంది. అందువల్ల ఈ ప్రాంతంలోని దేశాలు అఫ్గాన్ వ్యవహారంపై దృష్టి సారించాలి. సమస్య పరిష్కారానికి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. మనం నాలుగు అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. అఫ్గానిస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటు అందరి ఆమోదంతో జరగలేదు. ఎలాంటి సంప్రదింపులు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌లోని కొత్త వ్యవస్థను గుర్తించాలా? వద్ద? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ప్రభుత్వంలో మహిళలు, మైనారిటీలు, అన్ని వర్గాల వారి భాగస్వామ్యం ఉండాలి. అందువల్ల.. కొత్త వ్యవస్థ గుర్తింపుపై అంతర్జాతీయ సమాజం సరైన నిర్ణయం తీసుకోవాలి. పూర్తిస్థాయిలో చర్చలు జరిపి, అన్నివైపులా వాదనలు విని ఓ నిర్ణయానికి రావాలి. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుంది."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
అత్యాధునిక ఆయుధాలు ఆఫ్గాన్లోనే ఉండిపోయాయని, అందువల్ల ఆ ప్రాంతంలో అనిశ్చితి ఏర్పడే ప్రమాదం ఉందన్నారు మోదీ.
'దుషాంబే డిక్లరేషన్' ఆమోదం..
ఎస్సీఓ సమావేశంలో 'దుషాంబే డిక్లరేషన్'ను ఆమోదించాయి సభ్య దేశాలు. స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య, శాంతియుత అఫ్గాన్‌కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించాయి. అన్ని వర్గాలతో కూడిన ప్రభుత్వం అఫ్గాన్‌లో ఉండాలని అభిప్రాయపడ్డాయి. ఉగ్రవాదాన్ని ఖండించాయి. ఉగ్రవాదాన్ని నిర్మూలించి, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు అందకుండా చేసేందుకు చర్యలు చేపట్టే విధంగా ప్రణాళికలు రచించాలని సభ్య దేశాలు అంగీకారానికి వచ్చాయి.
అంతకుముందు.. షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) 20వ వార్షికోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఎస్సీఓలో కొత్తగా ఇరాన్ చేరడాన్ని స్వాగతించారు. చర్చా భాగస్వాములుగా చేరిన సౌదీ అరేబియా, ఈజిప్ట్, కతర్కు కూడా స్వాగతం పలికారు.
ఎస్సీఓ భవిష్యత్తు గురించి ఆలోచించేందుకు ఇదే సరైన సమయమని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలో శాంతి, భద్రత, విశ్వసనీయత లోపించడం వంటి అంశాలు అతిపెద్ద సవాళ్లని తెలిపారు. అతివాదం, తీవ్రవాదం పెరగడమే ఈ సమస్యలకు మూల కారణమన్నారు. అఫ్గాన్‌లో ఇటీవలి పరిణామాలు దీన్ని స్పష్టం చేశాయని పేర్కొన్నారు. ఉగ్రవాదం, అతివాదం, తీవ్రవాదంపై పోరుకు ఎస్సీఓ సభ్య దేశాలు ఓ పటిష్ఠ ప్రణాళిక రూపొందించి అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. మధ్య ఆసియా దేశాలతో సత్సంబంధాలకు భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:- 'తీవ్రవాదం పెను సవాల్- ఉమ్మడి పోరు తక్షణావసరం'