దేశంలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధే అజెండాగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. రైల్వేస్టేషన్ అంటే కేవలం ప్రయాణప్రాంగణమే కాకుండా ఎన్నో సదుపాయాలకు కేంద్రంగా ఆధునీకరిస్తున్నారు. నగరాలు, పట్టణాల ఆర్థిక వృద్ధికి దోహదంచేసేలా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలన్న ప్రధాని మోదీ దార్శనికత మేరకు.. గుజరాత్‌లోని గాంధీనగర్ రైల్వేస్టేషన్‌ను ఆధునీకరించారు. ప్రపంచ స్థాయిలో ప్రయాణికులకు సదుపాయాలు ఏర్పాటు చేయటంతోపాటు రైల్వేస్టేషన్‌పై 5నక్షత్రాల హోటల్ నిర్మాణం చేపట్టారు. ఈ హోటల్ నిర్మాణంతో గాంధీనగర్ రైల్వేస్టేషన్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ప్రత్యేక సదుపాయాలతో..
గాంధీనగర్ రైల్వే స్టేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ కంపెనీ, గుజరాత్ ప్రభుత్వం, భారత రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్పోరేషన్ సంయుక్తంగా గాంధీనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు చేపట్టాయి. ఇందుకోసం 71.50 కోట్లు వ్యయం చేశారు. రైల్వేస్టేషన్ ప్రవేశం, బయటికి వెళ్లే ద్వారాల చుట్టూ అందంగా ముస్తాబుచేశారు. 163కార్లు, 40 ఆటోలు, 120 ద్విచక్ర వాహనాలు పార్క్ చేసే సదుపాయం ఉంది. రైల్వేస్టేషన్‌లోని 3ప్లాట్‌ఫారాలను రెండు సబ్ వేలతో అనుసంధానం చేశారు. ప్లాట్‌ఫారంపై 480 మంది ప్రయాణికుల సామర్థ్యంతో నిరీక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విశాలమైన టికెట్ కౌంటర్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక టికెట్ కౌంటర్లు, ర్యాంపులు, లిఫ్ట్‌లు ఆధునీకరించిన గాంధీనగర్ రైల్వే స్టేషన్‌లో ఉన్నాయి.
మెట్రో స్టేషన్ల తరహాలో రెండు ఎస్కలేటర్లు, మూడు ఎలివేటర్లు కూడా ఉన్నాయి. గాంధీనగర్ రైల్వే స్టేషన్ మొత్తం నిరంతరాయంగా వైఫై సౌకర్యం కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇవే కాక వేర్వేరు మతాలవారి కోసం ప్రార్థనా మందిరాలు, ప్రత్యేకంగా బేబీ ఫీడింగ్ గదులు ఉన్నాయి. 40 మందికి సరిపోయే నిరీక్షణ కేంద్రాన్ని కేంద్రీకృత ఏసీతో ముస్తాబు చేశారు. దాదాపు 7వేల ఒక వంద స్క్వేర్ మీటర్లున్న గాంధీనగర్ ఆధునాతన రైల్వే స్టేషన్‌లో భవిష్యత్తు వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. రాబోయే రోజుల్లో మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ సెంటర్లు, ఫలహార కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి.
" ప్రధాని మోదీ సీఎంగా ఉన్నప్పుడు మహాత్మా మందిర్ నిర్మించాలని సూచించారు. అందులో హోటల్ కూడా ఉండాలన్నారు. ఈ మహాత్మా మందిర్‌లో పెద్ద పెద్ద సమావేశ హాళ్లు ఉంటాయి. రెండేళ్లకోసారి జరిగే వైబ్రెంట్ గుజరాత్ సదస్సుకు విదేశాల నుంచి ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు తదితరులు వస్తుంటారు. అలాంటివారి కోసం ఓ హోటల్, ఈ రైల్వేస్టేషన్. ఇదో సందర్శనీయ ప్రాంతం కావాలి. సిటీసెంటర్ రైల్ మాల్ ప్రాజెక్ట్‌లోని అనేక సదుపాయాల్లో ప్రయాణం ఒకటి. ఇంకా రిటైల్, వినోదం వంటి సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని ఈ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతోంది."
--సంజీవ్‌కుమార్ లోహియా, ఎండీ, సీఈవో, రైల్వేస్టేషన్ అభివృద్ధి కార్పోరేషన్.
పర్యావరణహితంగా..
ఆధునాతన సాంకేతిక సాయంతో గాంధీనగర్ రైల్వేస్టేషన్‌ను పర్యావరణహితంగా ఆధునీకరించారు. ఇప్పటికే అసోచామ్ నుంచి హరిత ధ్రువపత్రం కూడా ఇది పొందింది. 120ఏళ్లపాటు పటిష్టంగా ఉండేలా రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు చేపట్టారు. ప్లాట్‌ఫారంసహా రైల్వే స్టేషన్ అంతా అగ్నిప్రమాదరహితంగా అభివృద్ధి చేశారు. ప్రయాణికులు రాకపోకలు సాగించే మార్గాలు, సబ్ వేలను అగ్నిప్రమాదరహితంగా, ఫైర్ స్ప్రింక్లర్స్ లైటింగ్ ఏర్పాటు చేశారు. గాంధీనగర్ రైల్వేస్టేషన్ వెలుపలి భాగాన్ని 32 థీమ్‌లతో కూడిన లైటింగ్‌తో చూపరులను ఆకట్టుకునేలా ముస్తాబు చేశారు.
రైల్వే ట్రాక్‌పై ప్రపంచస్థాయి వసతులతో ఐదునక్షత్రాల హోటల్‌ను నిర్మించారు. ఇందులో బసచేసే అతిథులకు రైళ్లు వెళ్లే సమయంలో ప్రకంపనలు, శబ్ధం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అత్యాధునిక వసతుల కల్పనే లక్ష్యంగా దేశంలోని 125 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి చేస్తున్నారు. దేశంలో ఆధునీకరించిన రైల్వే ప్రయాణికుల ప్రాంగణాల్లో గాంధీనగర్ రైల్వే స్టేషన్ మొట్టమొదటిదని రైల్వే అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: