భారత్కు చెందిన 157 అత్యంత పురాతన కళాఖండాలను (India Artefacts) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వదేశానికి తీసుకురానున్నారు. అమెరికాలో ఉన్న ఈ కళాఖండాలను అక్కడి సాంస్కృతిక శాఖ భారత్కు అప్పగించింది. మోదీ పర్యటనలో భాగంగా వీటిని భారత్కు అందించింది. అమెరికా పర్యటనను (Modi US tour 2021) ముగించుకున్న ప్రధాని మోదీ (PM Modi).. వీటిని తీసుకొని భారత్కు బయల్దేరారు.
ఈ కళాఖండాల్లో క్రీస్తు శకం 10వ శతాబ్దానికి చెందిన విగ్రహాలు, 12వ శతాబ్దానికి చెందిన రాగి నటరాజ విగ్రహం వంటివి ఉన్నాయి. చాలా వరకు కళాఖండాలు 11 నుంచి 14వ శతాబ్దానికి చెందినవే. 45 కళాఖండాలు మాత్రం క్రీస్తు పూర్వానికి చెందినవి ఉన్నట్లు తెలుస్తోంది. సగం కళాఖండాలు సంస్కృతికి సంబంధించినవి కాగా మిగిలినవి హిందూ, బౌద్ధం, జైన మతాలకు చెందినవి ఉన్నాయి.
వీటిని భారత్కు అందించడాన్ని మోదీ స్వాగతించారు. ఈ సందర్భంగా ప్రధాని వారికి కృతజ్ఞతలు తెలిపారు. అక్రమ మార్గాల్లో సాంస్కృతిక వస్తువులను తరలించకుండా చర్యలు బలోపేతం చేయాలని ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు నిర్ణయించారని అధికారులు తెలిపారు. భారత్కు చెందిన పురాతన వస్తువులను, కళాఖండాలను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని మోదీ ప్రభుత్వం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. (Modi US tour 2021)
ఇదీ చదవండి: 'భారత్లో సంస్కరణలతో ప్రపంచం రూపాంతరం'