Modi Speech BJP Foundation Day: భారతీయ జనతా పార్టీ దేశభక్తికి కట్టుబడి ముందుకెళ్తుంటే.. విపక్షాలు మాత్రం తమ కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తూ పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించేలా చేసినందుకు భాజపా సభ్యులంతా గర్వపడాలని పేర్కొన్నారు. భాజపా 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లాడిన ఆయన.. ఇటీవల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీలన్నీ.. ఓటు బ్యాంకు రాజకీయాలే చేశాయని మండిపడ్డారు. సమాజంలోని కొన్ని వర్గాలపై హామీల వర్షం కురిపించి.. మిగిలిన వారిని పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ రాజకీయాల వల్ల వివక్ష, అవినీతి పెరిగిపోయాయని అన్నారు.
"4 రాష్ట్రాల్లో మళ్లీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 3 దశాబ్దాల తర్వాత రాజ్యసభలో భాజపా బలం 100 దాటింది. దేశంలో ఇప్పటికే 180 కోట్లకు పైగా కొవిడ్ టీకాలు పంపిణీ చేశాం. కరోనా కాలంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇచ్చాం. రూ.3.5 లక్షల కోట్లు వెచ్చించి పేదల ఆకలి తీర్చాం. దేశం వేగంగా ముందుకెళ్తోందని ప్రతి పౌరుడు గర్వంగా చెప్తున్నాడు. గత ప్రభుత్వాలు దేశ యువతను మోసం చేశాయి. వారి ప్రతిభ వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించలేదు. రాజ్యాంగ విలువలతో సంబంధం లేకుండా తమ కుటుంబ పాలనను మరింత విస్తృతం చేసేందుకే పనిచేశాయి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
Modi on Ukraine crisis: దేశ ప్రయోజనాలపై భారత్ వెనకడుగు వేయదని మోదీ స్పష్టం చేశారు. రష్యా- ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో మాట్లాడిన మోదీ.. ప్రపంచమంతా రెండు వర్గాలుగా విడిపోయినప్పటికీ భారత్ మాత్రం ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా స్వతంత్రంగా వ్యవహరించిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు వేగంగా మారిపోతున్నాయని పేర్కొన్న మోదీ.. ఈ పరిస్థితుల్లో భారత్కు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఉద్ఘాటించారు. వీటిని అందుకునేందుకు దేశప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Amit Shah BJP foundation day: పేదల ఆశయాల సాధనే లక్ష్యంగా భాజపా పనిచేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఏడు దశాబ్దాలుగా వీరంతా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు. దేశసేవే భాజపా మార్గమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మార్గదర్శకత్వంలో భాజపా దేశ అభివృద్ధిలో వేగంగా దూసుకెళ్తోందని చెప్పారు. '2014కు ముందు పేదలకు రెండు పూటలా భోజనం లభించడమే గగనమైపోయింది. మోదీ ప్రభుత్వం వచ్చాక.. పేదలకు ఇళ్లు, విద్యుత్ కనెక్షన్, వంట గ్యాస్, టాయిలెట్లు, బ్యాంకు అకౌంట్లు వచ్చాయి' అని షా ట్వీట్ చేశారు.
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిల్లీలో నిర్వహించిన భాజపా శోభా యాత్రలో పాల్గొన్నారు. భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలు.. పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించుకున్నారు. తమతమ రాష్ట్రాల్లో భాజపా జెండాను ఆవిష్కరించారు.
ఇదీ చదవండి: అతడు సినిమా 'రివర్స్'.. ఆస్తి కోసం కొడుకుగా నటించి.. 41 ఏళ్ల తర్వాత..!