వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ పరిసరాల్లో రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తీవ్ర మేధోమథనం చేసిన తర్వాత ఈ చట్టాలను పార్లమెంట్ ఆమోదించిందని చెప్పారు. వీటి ద్వారా రైతులకు ఉన్న అడ్డంకులు తొలగిపోవడమే కాక.. కర్షకులకు కొత్త హక్కులు, అవకాశాలు అందాయని వెల్లడించారు.
మన్‌కీ బాత్ రేడియో కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. తక్కువ వ్యవధిలోనే రైతుల సమస్యలను తగ్గించేందుకు ఈ చట్టాలు ఉపకరించాయని పేర్కొన్నారు. ఇటీవల ఈ చట్టాన్ని ఉపయోగించుకొని ప్రయోజనం పొందిన రైతుల గాథలను ఉదహరించారు.
"రైతుల ప్రయోజనం కోసం ఈ చట్టాలు రూపొందించేందుకు చాలా కాలంగా రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చాయి. ఇవి ఇప్పుడు నెరవేరాయి. లోతైన చర్చల తర్వాత పార్లమెంటు ఈ చట్టాలను ఆమోదించింది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
మన్‌కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మోదీ అనేక అంశాలపై మాట్లాడారు. వ్యాక్సిన్ విషయమై లాక్డౌన్ తర్వాత నుంచే చర్చలు ప్రారంభించినట్లు చెప్పారు. కరోనా పట్ల నిర్లక్ష్యం వహించడం ప్రమాదకరమని హెచ్చరించారు. కలిసికట్టుగా వైరస్‌పై పోరాడాలని స్పష్టం చేశారు. కొవిడ్ పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా పండుగలు జరుపుకున్నారని మోదీ అన్నారు.
సంస్కృతిపై
భారతీయ సంస్కృతి, శాస్త్రాలు ఎప్పటికీ ప్రపంచానికి ఆదర్శంగా ఉంటాయని ఉద్ఘాటించారు మోదీ. భారతీయ సంస్కృతిపై అధ్యయనానికి చాలా మంది విదేశీయులు వచ్చారని తెలిపారు. ఇలా భారత్‌కు వచ్చి వేదాంతాలు నేర్చుకున్న బ్రెజిల్ దేశస్థుడు జోనాస్ మసేతీ గురించి వివరించారు.
న్యూజిలాండ్‌లో కొత్తగా ఎన్నికైన ఎంపీ గౌరవ్ శర్మ సంస్కృతంలో ప్రమాణం చేసిన విషయాన్ని గుర్తు చేసిన మోదీ.. ఈ పరిణామాలు భారతీయ సంస్కృతి వ్యాప్తికి దోహదపడుతుందని అన్నారు.
అన్నపూర్ణ దేవి పురాతన విగ్రహం కెనడా నుంచి భారత్‌కు తీసుకొస్తున్నట్లు తెలిపారు మోదీ. ఈ విషయం పట్ల భారతీయులందరూ గర్వపడాలని అన్నారు. 1913లో ఈ విగ్రహం వారణాసి మందిరం నుంచి అపహరణకు గురైందని చెప్పారు.
ప్రముఖుల గురించి...
సోమవారం గురునానక్ జయంతి నిర్వహించుకుంటున్నామని గుర్తు చేశారు మోదీ. ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. వాంకోవర్ నుంచి వెల్లింగ్టన్ వరకు, సింగపూర్ నుంచి సౌతాఫ్రికా వరకు ఆయన సందేశం ప్రతిధ్వనిస్తోందని చెప్పారు.
పక్షులకు సంబంధించి డా.సలీమ్ అలీ విశేష పరిశోధనలు చేశారని మోదీ గుర్తు చేశారు. త్వరలో ఆయన 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోనున్నామని తెలిపారు.