45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకునేలా చర్యలు తీసుకోవాలని తన లోక్సభ నియోజకవర్గమైన ఉత్తర్ప్రదేశ్ వారణాసి జిల్లా అధికారులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. వారణాసిలో కొవిడ్ పరిస్థితులపై అక్కడి అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజలకు సాధ్యమైనంత త్వరగా తగిన సాయం అందించాలని అధికారులను కోరారు. మహమ్మారిని అరికట్టడానికి సమాజంతో పాటు ప్రభుత్వ సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
"కరోనా మొదటి దశ వ్యాప్తి సమయంలో చేపట్టినట్లుగా ట్రాకింగ్, ట్రేసింగ్, టెస్టింగ్ విధానాన్ని ఈ సారి కూడా విస్తృతంగా అమలు చేయాలని మోదీ ఈ సమీక్షలో అధికారులకు సూచించారు. 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. "
- ప్రధాన మంత్రి కార్యాలయం
వారణాసిలో కరోనా పరీక్షల నిర్వహణ, పడకల సదుపాయం, వ్యాక్సిన్లు, వైద్యుల సేవలను మోదీ ప్రశంసించారు. కరోనా కట్టడి కోసం ప్రజలంతా భౌతిక దూరం, మాస్కులు ధరించాలని కోరారు.
ఇదీ చూడండి: 'భాజపా దూకుడు చూసి నిరాశలో మమత'
ఇదీ చూడండి: 'కొవిడ్ పోరులో రాష్ట్రాలకు పూర్తి సహకారం'