దేశంలోని పోలీసులందరికీ ఒకే యూనిఫాం ఉండాలనే ప్రతిపాదన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. హరియాణాలోని సూరజ్‌కుండ్‌లో జరుగుతున్న రాష్ట్ర హోంమంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగించారు. ఒకే యూనిఫాం అనేది సూచన మాత్రమేనని.. దానిని రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నం చేయట్లేదని ఆయన స్పష్టం చేశారు. నేరాలను నియంత్రించేందుకు, నేరస్థులను పట్టుకునేందుకు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఉండాలని మోదీ తెలిపారు.
దేశ అంతర్గత భద్రత కోసం రాష్ట్రాలతో కలిసి పనిచేయడం కేంద్రం బాధ్యత అని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ప్రకారం శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించినవి అయినప్పటికీ.. అవి దేశ ఐక్యత, సమగ్రతతో ముడిపడి ఉంటాయని ప్రధాని తెలిపారు.
'ఒకే దేశం ఒకే యూనిఫాం' అనేది కేవలం ఒక ఆలోచన. నేను దానిని మీపై రుద్దే ప్రయత్నం చేయట్లేదు. ఇది 5 నుంచి 100 ఏళ్లలో ఎప్పుడైనా జరగవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. దేశవ్యాప్తంగా ఉన్న పోలీసులకు ఒకే యూనిఫాం ఉండాలని నేను భావిస్తున్నా. పాత చట్టాలను సవరించాలి.. వాటిని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలి. పోలీసులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పరస్పరం సహకరించుకుని పనిచేయాలి."
--ప్రధాని మోదీ
సమావేశాల ముఖ్య ఉద్దేశం ఇదే..
విజన్ 2047, ప్రధాని మోదీ పంద్రాగస్టు ప్రసంగంలో ప్రకటించిన పంచ్ ప్రాణ్ అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయటమే ఈ చింతన్ శిబిర్ ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సైబర్ నేరాల నిర్వహణ వ్యవస్థ అభివృద్ధి, పోలీసు బలగాల ఆధునీకరణ, నేర న్యాయవ్యవస్థలో ఐటీ వాడకం పెంపు, భూ సరిహద్దు నిర్వహణ, తీర ప్రాంత భద్రత తదితర అంశాలపై చర్చించనున్నారు. '2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్' లక్ష్యం సాధనకు నారీ శక్తీ చాలా ముఖ్యమని, మహిళ భద్రత కోసం వారికి సురక్షిత వాతావరణ కల్పించటం ప్రధానమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతర్గత భద్రతకు మెరుగైన ప్రణాళిక, సమన్వయానికి జాతీయ విధానం తయారు చేయటం ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నాయి.
ఇవీ చదవండి: మానసిక రోగుల మధ్య ప్రేమ.. కుంగుబాటును జయించి, భార్యాభర్తలుగా కొత్త జీవితం
ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారం