తూర్పు లద్దాఖ్‌లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్-చైనాలు బలగాలను మోహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాలు వివిధ మార్గాల్లో, స్థాయిల్లో చర్చలు జరిపాయి. అయితే ఇప్పటివరకు చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఆసియాలోనే అతిపెద్ద, శక్తిమంతమైన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలంటే ఇక మిగిలింది దేశాధినేతల భేటీనే. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ప్రధాని నరేంద్ర మోదీ- చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీపైనే ఉంది.
ప్రస్తుతం రెండు దేశాల భవిత ఇరు దేశాధినేతల చేతిలోనే ఉంది. సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గేలా తగిన నిర్ణయం తీసుకునే అవకాశం వారికి దక్కింది. ఎందుకంటే వివిధ వేదికలపై వచ్చే 20 రోజుల్లో ఐదు సార్లు మోదీ-జిన్‌పింగ్ భేటీ అయ్యే అవకాశం ఉంది.
సున్నితమైన భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గాలంటే మోదీ- జిన్‌పింగ్ భేటీయే సరైన మార్గం. ఎందుకంటే బలమైన ఇద్దరు జాతీయ నాయకులు, రెండు పెద్ద దేశాలను పాలిస్తున్న దిగ్గజ నేతల చర్చతోనే సరిహద్దు వివాదంపై ఓ ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.
భేటీల వివరాలు...
- నవంబర్ 10న జరగబోయే షాంఘై సహకార సదస్సులో మోదీ- జిన్‌పింగ్ తొలి భేటీ జరగనుంది. వర్చువల్ వేదికగా జరిగే ఈ చర్చను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏర్పాటు చేస్తున్నారు. భారత్- చైనా ఇందులో శాశ్వత సభ్య దేశాలు.
- తరువాత రెండు రోజుల్లో నవంబర్ 12-15 మధ్య జరగబోయే ఆసియన్ సదస్సులో మరోసారి ఇరువురు నేతలు భేటీ అవుతారు. ఈ భేటీకి వియత్నాం.. భారత్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించింది.
- నవంబర్ 17న జరగబోయే ఐదు దేశాల బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) సదస్సులో మోదీ-జిన్‌పింగ్ మరోసారి ఎదురెదురుపడతారు. ఈ భేటీని కూడా రష్యా ఏర్పాటు చేస్తోంది.
- నవంబర్ 21-22న జీ20 సదస్సు జరగనుంది. ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన, పారిశ్రామిక, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇందులో సభ్యులు. భారత్, చైనా రెండూ ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. సౌదీ అరేబియా ఈ భేటీకి ఆతిథ్యమిస్తుంది.
- చివరిగా నవంబర్ 30న జరగబోయే ఎస్సీఓ (కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్)లో మోదీ-జిన్‌పింగ్ భేటీ అవుతారు. ఈ భేటీకి భారత్ ఆతిథ్యం ఇస్తుంది.
అయితే వాస్తవానికి ఈ సదస్సుల్లో ఇరు దేశాధినేతలు ఎదురెదురు పడకపోవచ్చు. కానీ ఒకే వేదికలో ఒకే సమయానికి చర్చల్లో ఉంటారు. ఈ సందర్భంగా సరిహద్దు వివాదం చర్చకు వచ్చే అవకాశం ఉంది.
- సంజీవ్ కె బారువా (సీనియర్ జర్నలిస్ట్)
ఇదీ చూడండి: మరోసారి ఆంగ్ సాన్ సూకీకే మయన్మార్ జై!