PM Modi on SC classification : మాదిగలకు అన్యాయం జరిగిందని తాము భావిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. బంగారు లక్ష్మణ్ తమ పార్టీకి అధ్యక్షుడిగా పని చేశారని తెలిపారు. ఆయన కింద గతంలో తాను పని చేశానని గుర్తు చేసుకున్నారు. బంగారు లక్ష్మణ్ నుంచి ఎంతో నేర్చుకున్నానన్న పీఎం.. ఆయనను గురువుగా భావిస్తానన్నారు. ఈ క్రమంలోనే మందకృష్ణ ఆశయాలకు అనుగుణంగా తాను మాదిగలతో కలిసి పని చేస్తానని వెల్లడించారు. 30 ఏళ్ల పోరాటానికి నాయకత్వం వహిస్తున్న మందకృష్ణ నిజమైన యోధుడని కొనియాడారు. మందకృష్ణ తల్లిదండ్రులు ధన్యులని అభివర్ణించారు. ఇంతకాలం పాటు అహింసా మార్గంలో పోరాడటం గొప్ప విషయమన్న మోదీ.. మాదిగల ఉద్యమాన్ని గుర్తించానని, గౌరవిస్తానని పేర్కొన్నారు.
'బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాదిగ విరోధులు - మందకృష్ణ ఆశయాలకు అనుగుణంగా మీతో కలిసి పనిచేస్తా'
మాదిగల పోరాటంలో న్యాయం ఉందని భావిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఎస్సీల హక్కుల సాధనలో తమ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. ఈ క్రమంలోనే ఎస్సీ వర్గీకరణ అంశానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. త్వరలోనే కమిటీ వేసి.. మాదిగలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. సామాజిక న్యాయానికి తాము కట్టుబడి ఉన్నామన్న ఆయన.. మందకృష్ణ మాదిగ పోరాటానికి అండగా ఉంటానని హామీ ఇస్తున్నానని స్పష్టం చేశారు.
కంటతడి పెట్టిన మందకృష్ణ మాదిగను ఓదార్చిన ప్రధాని మోదీ
మీ పోరాటంలో న్యాయం ఉందని భావిస్తున్నాం. మీ హక్కుల సాధనలో మా తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తాం. ఎస్సీ వర్గీకరణ అంశానికి కట్టుబడి ఉన్నాం. మీ హక్కుల కోసం చేస్తున్న న్యాయ పోరాటంలో మా వంతు సాయం చేస్తాం. త్వరలోనే కమిటీ వేస్తాం.. మీకు న్యాయం జరిగేలా చూస్తాం. - నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
మూడ్రోజుల పర్యటన కోసం ఈ నెల 25న తెలంగాణకు మోదీ - 27న హైదరాబాద్లో రోడ్ షో