ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికలు జమ్ముకశ్మీర్ ప్రాంతంలో కొత్త అధ్యాయాన్ని లిఖించాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పారదర్శకమైన ఎన్నికల ప్రక్రియ, ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనటం భారత్‌కు గర్వకారణమని పేర్కొన్నారు.
జమ్ముకశ్మీర్ ప్రజలందరికీ ఆరోగ్య బీమా అందించడమే లక్ష్యంగా ఆయుష్మాన్ భారత్ పథకం పరిధి పెంపును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు మోదీ. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై పరోక్ష విమర్శలు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ పుదుచ్చేరిలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించని వారు ప్రజాస్వామ్యంపై తనకు పాఠాలు నేర్పాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడిన ఏడాదిలోనే జమ్ముకశ్మీర్‌లో త్రీ-టైర్ పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్లు చెప్పారు. తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కును ప్రజలకు కల్పించటమే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.
"దిల్లీలో ఉన్న కొందరు నాకు ప్రజాస్వామ్యంపై పాఠాలు చెప్పాలనుకుంటున్నారు. నాపై ఆరోపణలు చేశారు. కానీ, పుదుచ్చేరిలో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ ఆచరించలేకపోతున్నారు. జమ్ముకశ్మీర్ డీడీసీ ఎన్నిక్లలో తాము చేసిన పనులతోనే కానీ, పేరుతో గెలవలేదు. కశ్మీర్‌ను అన్నివిధాల అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీర్ఘకాలంగా అధికారంలో ఉండి సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిని విస్మరించి పెద్ద తప్పు చేశారు. కానీ మా ప్రభుత్వం దానిని సరిచేసింది. "
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
కశ్మీర్లో సరిహద్దు కాల్పులు ప్రధాన సమస్యగా ఉందన్నారు మోదీ. సాంబ, పూంచ్, కథువా వంటి కీలక ప్రాంతాల్లో బంకర్ల నిర్మాణం వేగవంతం చేసినట్లు చెప్పారు. డీడీసీ ఎన్నికల ద్వారా జమ్ముకశ్మీర్.. మహాత్ముడు కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించుకుందని పేర్కొన్నారు. డీడీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్య బలోపేతం, కశ్మీర్ అభివృద్ధి కోసం ప్రజలు ఓటు వేశారని ఉద్ఘాటించారు.
21 లక్షల కుటుంబాలకు..
ఆయుష్మాన్ భారత్ ద్వారా జమ్ముకశ్మీర్‌లో ఇప్పటికే 6 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతుండగా.. తాజా విస్తరణతో మరో 15 లక్షల కుటుంబాలకు ఆరోగ్య బీమా వర్తించనుంది. మొత్తంగా 21లక్షల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ పథకం అందుబాటులోకి రానుందని మోదీ తెలిపారు. చికిత్స కోసం కశ్మీర్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకే పరిమితం కాకూడదని, దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఆసుపత్రులు ఈ పథకంలో భాగమైనట్లు తెలిపారు.
ఇదీ చూడండి: మహిళా సాధికారత ఎప్పటికి సాధ్యం?