ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర్‌ప్రదేశ్ పర్యటనలో భాగంగా (Pm Modi Ayushman Bharat) ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అమలోకి రానున్న ఈ పథకాన్ని మోదీ.. తన నియోజకవర్గమైన వారణాసిలో శ్రీకారం చుట్టారు. దీనితో పాటు మోదీ తన నియోజకవర్గం పరిధిలో రూ.5200 కోట్లు విలువ చేసే ప్రాజెక్టులను ప్రారంభించారు.
దేశంలోని వైద్యారోగ్య రంగానికి మెరుగైన మౌలిక వసతుల కల్పనే (Pm Modi Ayushman Bharat) లక్ష్యంగా ఈ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని 17,788 ఆరోగ్య కేంద్రాలు లబ్ధిపొందనున్నాయి. వీటితో పాటు పట్టణ ప్రాంతాల్లో 11,024 ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం నిర్మించనుంది.
- దేశంలో 5 లక్షలకుపైగా జనాభా ఉన్న అన్ని జిల్లాల్లో అత్యవసర సేవలు అందించే కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి.
- దేశవ్యాప్తంగా ల్యాబరేటరీ నెట్వర్క్ ద్వారా ప్రజలకు పూర్తి స్థాయిలో డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులో ఉంటాయి.
- ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌తో దేశంలో వైరాలజీకి సంబంధించి నాలుగు నేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఆగ్నేయ ఆసియా పరిధిలోని డబ్ల్యూహెచ్ఓ పరిశోధన కేంద్రం, తొమ్మిది లెవెల్ 3 బయోసేఫ్టీ ల్యాబొరేటరీస్ అందుబాటులోకి వస్తాయి.
అంతకుముందు.. రాష్ట్రంలోని 9 వైద్య కళాశాలలను వర్చువల్‌గా ప్రారంభించారు మోదీ. రూ.2,329 కోట్ల వ్యయంతో సిద్ధార్థ్‌నగర్, ఈటాహ్, హర్దోయ్, ప్రతాప్‌గఢ్, ఫతేపుర్, దేవరియా, మీర్జాపుర్, జౌన్‌పుర్ జిల్లాల్లో ఈ కళాశాలలను నిర్మించారు.
ఈ కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాడవియా పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 'గత ప్రభుత్వాలు డబ్బు వేట.. మేము ప్రజల వెంట'