2017కు ముందు ఉత్తరప్రదేశ్‌లో పాలన.. గూండాలు, మాఫియా ద్వారా సాగేదని, అలాంటి వారు సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఇప్పుడు జైళ్లలో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో స్వాతంత్ర్య సమరయోధుడు రాజా మహేంద్ర ప్రతాప్ పేరు మీద నిర్మిస్తున్న విశ్వవిద్యాలయ నిర్మాణానికి ప్రధాని శంకుస్ధాపన చేశారు. అలీగఢ్ పారిశ్రామిక కారిడార్‌లో ఏర్పాటు చేసిన రక్షణ ప్రదర్శనను మోదీ పరిశీలించారు.
రక్షణ ఉత్పత్తుల్లో భారత్‌ను ఒకప్పుడు దిగుమతిదారుగా చూసేవారని, కాని ఇప్పుడు పెద్ద ఎగుమతిదారుగా పరిగణిస్తున్నారని వివరించారు. ఉత్తరప్రదేశ్‌లో ఒకప్పుడు ప్రతి కార్యక్రమంలో అవినీతి జరిగేదని, కాని ఇప్పుడు పరిస్ధితులు మారిపోయాయని తెలిపారు.
ఈ క్రమంలో దివంగత నేత కల్యాణ్ సింగ్‌ను స్మరించుకున్నారు మోదీ. తన సొంత జిల్లాలో రాజా మహేంద్ర ప్రతాప్ పేరుతో విశ్వవిద్యాలయం వస్తుండటాన్ని చూసి కల్యాణ్ సంతోషించేవారని అభిప్రాయపడ్డారు.
మొత్తం 92 ఎకరాల విస్తీర్ణంలో ఈ యూనివర్సిటీని నిర్మిస్తున్నారు. 395 కళాశాలలను దీనికి అనుబంధం చేయనున్నారు.
మాస్టర్ స్ట్రోక్..?
వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జాట్ దిగ్గజం, స్వాతంత్ర్య సమర యోధుడు, విద్యావేత్త ప్రతాప్ సింగ్ పేరుతో యూనివర్సిటీ ప్రారంభించడం భాజపా మాస్టర్ స్ట్రోక్‌గా రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. జాట్ సామాజిక వర్గం అధికంగా ఉన్న యూపీ పశ్చిమ ప్రాంతంలో రైతులు ఆందోళనలు ఉద్ధృతం కావడాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఇదీ చూడండి:- యూపీ ఎన్నికల ప్రచారాస్త్రం అయోధ్యే!