Modi Tripura Visit: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్రిపురలో పర్యటించారు. అగర్తలాలో మహారాజా వీర్ విక్రమ్ విమానాశ్రయంలో రూ. 3,400 కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌ను ప్రారంభించారు. అనంతరం.. అధికారులతో కలిసి అక్కడే కలియతిరిగారు. అభివృద్ధి పనులను దగ్గరుండి పరిశీలించారు.
ముఖ్యమంత్రి త్రిపుర గ్రామ్ సమృద్ధి యోజన, విద్యాజ్యోతి స్కూల్స్ ప్రాజెక్ట్ మిషన్ 100 వంటి కీలక కార్యక్రమాలను కూడా ప్రారంభించారు మోదీ. కేంద్ర విమానయాన శాఖ మంత్రి జోతిరాధిత్య సింధియా, త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ కూడా మోదీ వెంట ఉన్నారు.
ఈ సందర్భంగా గత ప్రభుత్వాలపై తీవ్ర ఆరోపణలు చేశారు మోదీ. గత ప్రభుత్వాలకు రాష్ట్ర అభివృద్ధిపై.. ఎలాంటి ముందుచూపు లేదని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు తమ హయాంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఈశాన్యానికి త్రిపుర గేట్‌వే అవుతుందని అన్నారు.
''త్రిపుర హెచ్ఐఆర్ఏ (హెచ్- హైవేలు, ఐ- ఇంటర్నెట్ వే, ఆర్-రైల్వేలు, ఏ- ఎయిర్‌పోర్ట్‌లు) మోడల్ అభివృద్ధికి నేను హామీ ఇస్తున్నా.'కిసాన్ రైలు ద్వారా.. త్రిపుర సేంద్రియ కూరగాయలు, పండ్లను దేశం మొత్తానికి ఎగుమతి చేస్తోంది. ఇక్కడి వెదురు ఉత్పత్తులకు దేశంలో మంచి మార్కెట్ ఏర్పడింది.''
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఇవీ చూడండి: Covid Third wave: 'దేశంలో కేసుల పెరుగుదల.. మూడోదశకు సంకేతాలు'