హిందీ భాషా దినోత్సవం(Hindi Diwas) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi).. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ప్రాంతాల్లోని ప్రజలు హిందీని సమర్థవంతమైన భాషగా మార్చారని పేర్కొన్నారు. వీరందరి కృషి వల్లే హిందీ భాష ప్రపంచ వేదికపై బలమైన ముద్ర వేస్తోందని అన్నారు.
కేంద్ర హోమంత్రి అమిత్ షా (Amit Shah News) కూడా హిందీ భాషా దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేశారు. అందరూ మాతృభాషతో పాటు అధికారిక భాష హిందీని కూడా ఉపయోగిస్తామని ప్రతిజ్ఞ బూనాలని పిలుపునిచ్చారు. మాతృభాష, అధికార భాష సమన్వయంతో దేశ పురోగతి గొప్పగా ఉంటుందని తెలిపారు.
'భావోద్వేగాలను వ్యక్తపరచడానికి భాష అత్యంత శక్తివంతమైన మాధ్యమం. మన సాంస్కృతిక చైతన్యం, జాతీయ సమైక్యతకు ప్రాథమిక ఆధారం. హిందీ కూడా ప్రాచీన నాగరికతకు, ఆధునిక పురోగతికి వారధి. మోదీజీ నాయకత్వంలో మేము హిందీతో పాటు ఇతర భారతీయ భాషల సమాంతర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం' అని షా పేర్కొన్నారు.
వెంకయ్య ట్వీట్..
1949 సెప్టెంబర్ 14న రాజ్యాంగ పరిషత్ హిందీని అధికారిక భాషగా గుర్తించిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Vice President Venkaiah Naidu)ట్వీట్ చేశారు. నాడు రాజ్యాంగంలో హిందీ, భారతీయ భాషలకు గౌరవం ఇచ్చిన రాజ్యాంగ పరిషత్ ఆదర్శాలు, సామరస్యాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరముందన్నారు. మన భాషలు దేశ సాంస్కృతిక ఐక్యతకు మూలమని, భారతీయ భాషలు నేర్చుకొని భాషా సామరస్యాన్ని పెంచాలని సూచించారు.
ఇదీ చదవండి: తగ్గుతున్న కరోనా వ్యాప్తి- దేశంలో కొత్తగా 25 వేల కేసులు