దేశవ్యాప్తంగా కరోనా తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఐదు విషయాల్లో నిక్కచ్చిగా ఉంటే కొవిడ్ కట్టడి చేయడం సులభమవుతుందని మోదీ అన్నారు. పరీక్షల నిర్వహణ, ట్రేసింగ్, చికిత్స, కొవిడ్ నిబంధనలు పాటించడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైనవి తప్పనిసరి అని పేర్కొన్నారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం నిబంధనలను విస్మరించినందు వల్లే వైరస్ ఉద్ధృతి పెరిగిందని అధికారిక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా 10 రాష్ట్రాల్లో మహమ్మారి వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోందని, దాదాపు 91 శాతం కేసులు ఆ రాష్ట్రాల్లోనివే అని స్పష్టం చేశారు.
కేంద్ర బృందాలు..
మహారాష్ట్రలో కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోను కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బృందాలు ఈ రాష్ట్రాల్లో పర్యటించాలని మోదీ ఆదేశించారు.
అవగాహన కార్యక్రమాలు...
ఏప్రిల్ 6 నుంచి 14 వరకు.. కరోనా జాగ్రత్తలు, మాస్క్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు మోదీ. దేశంలో ట్రయల్స్‌లో ఉన్న వ్యాక్సిన్ల అభివృద్ధిపైనా దృష్టి సారించాలని నిర్దేశించారు.